Mahaa Daily Exclusive

  అందుబాటులో నర్సరీ… ఆనందంలో మిర్చి రైతులు..! ఆధునిక సాగు పద్ధతులకు శ్రీ నాగ హనుమాన్ నర్సరీ తోడ్పాటు..

Share

  • మేలైన విత్తనాలతో నాణ్యమైన మిర్చి నారు
  • ఆధునిక సాగు పద్ధతులకు శ్రీ నాగ హనుమాన్ నర్సరీ తోడ్పాటు

కారేపల్లి,మహ: మిర్చి సాగులో నాణ్యమైన నారే కీలకమని రైతులు భావిస్తున్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక పద్ధతుల్లో మేలైన విత్తనాలతో నాణ్యమైన మిర్చి నారును సిద్ధం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది కారేపల్లిలోని శ్రీ నాగ హనుమాన్ నర్సరీ. కారేపల్లి నుంచి గేట్ కారేపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన నాలుగెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ గత ఐదేళ్లుగా మిర్చి రైతులకు నాణ్యమైన నారును అందిస్తూ వారి ఆదరణ పొందుతోంది.
ఐదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో మిర్చి నర్సరీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు నారు కోసం ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో రవాణా ఖర్చులతో పాటు సమయం కూడా వృథా అయ్యేది. దూర ప్రాంతాల నుంచి నారు తీసుకొచ్చే సమయంలో కొంతమేర దెబ్బతినడం, పొలాల్లో నాటిన అనంతరం ఆశించిన స్థాయిలో మొక్కలు ఎదగకపోవడం, దిగుబడులు తగ్గడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొనేవారు.
ఈ సమస్యలను స్వయంగా గమనించిన ఆదర్శ రైతు చెరుకుమళ్ల రామారావు, తన బంధువు దిరిశాల శ్యాంసుందర్‌రావుతో కలిసి రైతులకు స్థానికంగానే నాణ్యమైన మిర్చి నారు అందించాలనే ఉద్దేశంతో శ్రీ నాగ హనుమాన్ నర్సరీని ఏర్పాటు చేశారు.

రైతులే ఎంచుకున్న విత్తనాలతో నారు

ఈ నర్సరీ ప్రత్యేకత ఏమిటంటే రైతులు తమకు నచ్చిన మిర్చి విత్తనాలను స్వయంగా అందజేసి, వాటితో నారును పెంచించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే సుమారు వంద మంది రైతులు తమకు నచ్చిన విత్తనాలను నర్సరీ నిర్వాహకులకు అందజేసి, నారును పెంచించుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి రావడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.