Mahaa Daily Exclusive

  ఇజ్రాయెల్‌ను విమర్శిస్తే దేశం నుంచి పంపిస్తారా..? ట్రంప్‌ సర్కారుకు అమెరికా కోర్టు షాక్‌..

Share

  • ట్రంప్‌ సర్కారుకు అమెరికా కోర్టు షాక్‌.
  •  భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టీకరణ.

వాషింగ్టన్‌, మహా.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ చర్యలను విమర్శించడం, పాలస్తీనాకు మద్దతు తెలపడం వంటి రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసిన విదేశీ విద్యార్థులు, ఇతర చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై వీసాలు రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించేందుకు వలస చట్టాలను ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ న్యాయస్థానం తేల్చింది. శాన్‌జోస్‌లోని అమెరికా జిల్లా న్యాయమూర్తి నోయెల్‌ వైస్‌ ఇచ్చిన విస్తృత తీర్పు ట్రంప్‌ ప్రభుత్వ వలస విధానాలపై కీలక న్యాయపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రభుత్వానికి నచ్చిన అభిప్రాయాలను మాత్రమే వ్యక్తం చేసే హక్కు కాదని, ప్రభుత్వాన్ని, దాని విధానాలను, విదేశాంగ నిర్ణయాలను విమర్శించే హక్కు కూడా అందులో భాగమేనని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు నేరుగా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థి పత్రిక ది స్టాన్‌ఫోర్డ్‌ డైలీ దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబంధించినది. ట్రంప్‌ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడేవారు, ఇజ్రాయెల్‌పై విమర్శలు చేసేవారు, విశ్వవిద్యాలయాల్లో నిరసనలకు మద్దతు ఇచ్చేవారిపై వీసా రద్దు, నిర్బంధం, బహిష్కరణ వంటి చర్యలకు దిగుతుండటంతో తమ పత్రికలో పనిచేసే విదేశీ విద్యార్థులు భయంతో స్వీయ నియంత్రణకు గురవుతున్నారని స్టాన్‌ఫోర్డ్‌ డైలీ కోర్టును ఆశ్రయించింది. కొందరు విద్యార్థులు తమ వ్యాసాలను ప్రచురించకుండా వెనక్కి తగ్గారని, మరికొందరు పత్రిక నుంచి తప్పుకున్నారని, ఇంకొందరు తమ రచనలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని కోరినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది.

న్యాయమూర్తి నోయెల్‌ వైస్‌ తన 90 పేజీల తీర్పులో భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అమెరికా ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. ప్రభుత్వం తనకు నచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు ఒక వ్యక్తి వలస స్థితిని ఉపయోగించి శిక్షించే పరిస్థితి ఏర్పడితే అది ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి భయపడే పరిస్థితి ఏర్పడితే ప్రజలు స్వయంగా తమ మాటలను అణచుకోవాల్సి వస్తుందని, అటువంటి వాతావరణం రాజ్యాంగం రక్షించే స్వేచ్ఛకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ట్రంప్‌ ప్రభుత్వం వలస చట్టంలోని కొన్ని నిబంధనలను ఉపయోగించి విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, వారిపై బహిష్కరణ చర్యలు ప్రారంభించడం వివాదానికి కేంద్రబిందువైంది. ముఖ్యంగా విదేశాంగ విధాన ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు భావించే వ్యాఖ్యలు లేదా కార్యకలాపాల ఆధారంగా వీసా, వలస హోదాపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఉపయోగించడాన్ని న్యాయస్థానం పరిశీలించింది. ఆ అధికారాన్ని రాజ్యాంగం రక్షించే భావప్రకటనపై ప్రతీకార చర్యగా ఉపయోగించినప్పుడు అది మొదటి సవరణతో పాటు ఐదో సవరణలోని రాజ్యాంగ రక్షణలకు విరుద్ధంగా మారుతుందని కోర్టు పేర్కొంది.

ఈ కేసు వెనుక 2025లో ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ విద్యార్థులపై చర్యలు కీలకంగా ఉన్నాయి. గాజా యుద్ధం నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల నిరసనలు, ఇజ్రాయెల్‌ వ్యతిరేక వ్యాఖ్యలు పెరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని తీవ్రంగా పరిగణించింది. కొందరు విద్యార్థులు, కార్యకర్తలపై వీసా రద్దు, అరెస్టులు, నిర్బంధం, బహిష్కరణ చర్యలు చేపట్టింది. కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి మహ్మద్‌ ఖలీల్‌ సహా పలువురు అంతర్జాతీయ విద్యార్థుల కేసులు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.

ట్రంప్‌ ప్రభుత్వం మాత్రం విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేకత, హింసకు ప్రేరేపించే కార్యకలాపాలు, అమెరికా విదేశాంగ విధానానికి తీవ్రమైన నష్టం కలిగించే చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వాదించింది. అయితే ఈ అధికారాన్ని రాజకీయ అభిప్రాయాలను అణచివేయడానికి ఉపయోగించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి అభిప్రాయం ప్రభుత్వానికి నచ్చకపోవడం ఒక్కటే కారణంగా అతడి వీసా లేదా అమెరికాలో నివాస హక్కుపై ప్రతికూల చర్య తీసుకోవడం రాజ్యాంగపరంగా సమస్యాత్మకమని తీర్పు పేర్కొంది.