- తెలంగాణాలో మరో కొత్త ఎయిర్ పోర్ట్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయం
- ప్రకటించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- 7 న భద్రాద్రిలో పర్యటించనున్న కేంద్ర సాంకేతిక బృందం
న్యూఢిల్లీ, మహా : తెలంగాణలో మరో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సిద్ధమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తప్పకుండా విమానాశ్రయం నిర్మించాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ స్థల పరిశీలనకు త్వరలోనే కేంద్ర బృందం రానున్నదని తెలిపారు. ఈ మేరకు నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రితో భేటీ అయి, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాకపోవడంతో కొత్తగా గుర్తించిన స్థలాల వివరాలు తెలిపారు. నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు కొత్త స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. వారి నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సాంకేతిక బృందాన్ని పంపించేందుకు చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తీర్ధ యాత్రికులకే కాదు ప్రాంత అభివృద్ధికి కీలకం ఈ ప్రాజెక్టు భద్రాచలం తీర్థయాత్రికులు, స్థానిక ప్రజలకు గొప్ప ఉపయోగం చేకూర్చనుంది.
సింగరేణి పారిశ్రామిక ప్రాంతంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం సందర్శనకు వచ్చే భక్తులకు, వ్యాపారవేత్తలకు ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగై, ఈ ప్రాంత సమగ్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్రం నుండి సహకారం లభిస్తోంది, ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఏవియేషన్ అధారిటీకి అప్పగించగా, కాకతీయ థీమ్‌తో టెర్మినల్ నిర్మాణం చేపట్టి త్వరలో పనులు ప్రారంభించనున్నారు.








