Mahaa Daily Exclusive

  హసీనా తిరిగొస్తానంటున్నారు..!

Share

  • హసీనా తిరిగొస్తానంటున్నారు.
  •  అప్పగింతపై ఢాకా ఒత్తిడి!
  • ‘తారిఖ్‌ రెహమాన్‌ భారత్‌ పర్యటనపై అనిశ్చితి.
  •  డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న మాజీ ప్రధాని

న్యూఢిల్లీ, మహా:

బంగ్లాదేశ్‌ రాజకీయ సంక్షోభం మరోసారి భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలపై ప్రభావం చూపుతోంది. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో 2024 ఆగస్టులో అధికారాన్ని కోల్పోయి భారత్‌కు వచ్చిన మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి తమ దేశానికి అప్పగించాలని ఢాకా నుంచి వస్తున్న డిమాండ్‌ మరింత తీవ్రతరమైంది. హసీనా అప్పగింతను బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి తారిఖ్‌ రెహమాన్‌ ప్రతిపాదిత భారత్‌ పర్యటనతో ముడిపెట్టినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కీలక దశకు చేరాయి. ఇదే సమయంలో హసీనా సంచలన ప్రకటన చేశారు. తాను ఎప్పటికీ భారత్‌లో ఉండబోనని, తన స్వదేశానికి తిరిగి వెళ్లడం తన సొంత నిర్ణయమని, డిసెంబరు నాటికి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.

హిందుస్థాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో హసీనా తన భవిష్యత్‌ ప్రణాళికను స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు ఎటువంటి నిర్దిష్ట ఒప్పందం లేదా అప్పగింత ప్రక్రియ అవసరం లేదన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. తాను స్వయంగా దేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నానని, జీవితాంతం విదేశాల్లో ఉండే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. డిసెంబరు నాటికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నానని, అయితే ఖచ్చితమైన తేదీ, సమయం, ఏ ప్రాంతం నుంచి దేశంలోకి ప్రవేశిస్తానన్నది తర్వాత వెల్లడిస్తానని తెలిపారు.

తనను భారత్‌ నుంచి అప్పగించడాన్ని తారిఖ్‌ రెహమాన్‌ పర్యటనకు షరతుగా పెట్టడాన్ని కూడా హసీనా ప్రశ్నించారు. న్యూఢిల్లీ నుంచి తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలు భారత్‌, బంగ్లాదేశ్‌ సంబంధాలను ఎందుకు ప్రభావితం చేయాలని ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ వేదికలో తాను మాట్లాడిన విషయాలను రెండు దేశాల మధ్య సంబంధాలకు ముడిపెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం, మైనారిటీల భద్రత, ప్రభుత్వ సంస్థల పనితీరు వంటి అంశాలపై తాను మాట్లాడటం తన హక్కు అన్న ధోరణిని ఆమె వ్యక్తం చేశారు.

హసీనా వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది. 2024లో విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అప్పటి ప్రధాని పదవికి రాజీనామా చేసి హసీనా భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉన్నారు. అనంతరం బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మధ్యంతర ప్రభుత్వ కాలం ముగిసిన తర్వాత 2026లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తారిఖ్‌ రెహమాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి హసీనా అప్పగింత అంశం భారత్‌తో దౌత్య చర్చల్లో ప్రధాన అంశంగా కొనసాగుతోంది.

హసీనాపై బంగ్లాదేశ్‌లో తీవ్రమైన న్యాయపరమైన చర్యలు కూడా కొనసాగాయి. 2025 నవంబరు 17న బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ 2024 విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన కేసులో ఆమెను గైర్హాజరీలో దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఆమెపై ప్రేరేపణ, హత్యలకు ఆదేశాలు ఇవ్వడం, జరిగిన దారుణాలను అడ్డుకోవడంలో విఫలమవడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. హసీనా మాత్రం తనపై నమోదైన కేసులను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తున్నారు.

ఇదిలా ఉండగా తారిఖ్‌ రెహమాన్‌ భారత్‌ పర్యటనకు సంబంధించి గత కొన్ని వారాలుగా అనిశ్చితి కొనసాగుతోంది. భారత్‌ నుంచి ఆయనకు ద్వైపాక్షిక పర్యటనతో పాటు సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సు కార్యక్రమాలకు ఆహ్వానం ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే పర్యటనకు ముందు హసీనా అప్పగింతతో పాటు ఇతర పరారీలో ఉన్న నిందితుల విషయంలో భారత్‌ చర్యలు తీసుకోవాలని ఢాకా కోరింది. హసీనాను అప్పగించడం, అనుకూల వాతావరణం కల్పించడం వంటి అంశాలను బంగ్లాదేశ్‌ బహిరంగంగా ప్రస్తావించింది.

ఈ పరిణామాల మధ్య తారిఖ్‌ రెహమాన్‌ పర్యటనపై స్పష్టత రాకపోవడంతో రెండు దేశాల దౌత్య వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఒక దశలో ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంకేతాలు కనిపించాయి. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆయనకు సంబంధించిన కార్యక్రమంపై ఒక ప్రకటన వెలువడి కొద్దిసేపటికే వెనక్కి తీసుకోవడం కూడా అనిశ్చితిని మరింత పెంచింది. భారత విదేశాంగ శాఖ మాత్రం పర్యటనపై తక్షణం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

భారత్‌ మాత్రం హసీనా అప్పగింతపై తన వైఖరిని ప్రక్రియాపరంగానే కొనసాగిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో ఈ అంశాన్ని నిర్దిష్ట విధానాల ప్రకారం పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు బంగ్లాదేశ్‌ మాత్రం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని పదేపదే కోరుతోంది. దీంతో హసీనా అంశం కేవలం ఒక మాజీ ప్రధానిని అప్పగించే వ్యవహారంగా కాకుండా రెండు దేశాల భవిష్యత్‌ సంబంధాలను ప్రభావితం చేసే దౌత్యపరమైన అంశంగా మారింది.

హసీనా భారత్‌లో ఉండటంపై ఢాకా అభ్యంతరాలు కేవలం ఆమెను అప్పగించాలన్న డిమాండ్‌కే పరిమితం కాలేదు. భారత్‌ నుంచి ఆమె రాజకీయ ప్రకటనలు చేయడాన్ని కూడా బంగ్లాదేశ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఆగస్టు 5న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హసీనా వీడియో ద్వారా ప్రసంగించడం ఢాకాకు ఆగ్రహం తెప్పించింది. ఆమె ప్రసంగం ద్వారా బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కల్పించకూడదని అక్కడి ప్రభుత్వం భారత్‌ను కోరింది.

భారత్‌ మాత్రం ఆ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమమని స్పష్టం చేసింది. అక్కడ హసీనా చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం బాధ్యత వహించదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ వివరణ ఉన్నప్పటికీ హసీనా భారత్‌లో ఉండటం, ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేయడం బంగ్లాదేశ్‌తో సంబంధాల్లో సున్నితమైన అంశంగానే కొనసాగుతోంది.

Latest