Mahaa Daily Exclusive

  విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న బీజేపీ నేతల అరెస్టులు దారుణం: పొంగులేటి సుధాకర్‌రెడ్డి

Share

  •  రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
  •  పొంగులేటి సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, మహా:
తెలంగాణ విద్యార్థుల న్యాయమైన హక్కులు, భవిష్యత్తు కోసం పోరాడుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావుతో పాటు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని బీజేపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల జాతీయ సహ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారి తరఫున ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్టు చేయడం అణచివేత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వారి ఉన్నత విద్య, కెరీర్‌ అవకాశాలు ప్రమాదంలో పడుతున్నాయని పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల సమస్యలపై ఎన్‌. రామచందర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ కార్యకర్తలు నిరంతరం పోరాడుతున్నారని ఆయన తెలిపారు. రామచందర్‌రావు నిరాహార దీక్ష చేపట్టడంతో పాటు ముఖ్యమంత్రికి పలుమార్లు లేఖలు రాశారని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు దాదాపు 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో వినతిపత్రాలను సేకరించారని వెల్లడించారు.

లక్షలాది మంది విద్యార్థుల గొంతును ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించలేదని సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం విద్యార్థుల కోసం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమని, ఇది ప్రభుత్వ అహంకారానికి, అణచివేత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

తెలంగాణ యువత భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే 40 లక్షల మంది విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల గొంతు వినడానికి సిద్ధంగా లేని ప్రభుత్వానికి తెలంగాణ భవిష్యత్తు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.

ఎన్‌. రామచందర్‌రావుతో పాటు అరెస్టు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకుండా, కెరీర్‌ అవకాశాలను కోల్పోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

అరెస్టులు, అణచివేతలతో తెలంగాణ విద్యార్థుల గొంతును కాంగ్రెస్‌ ప్రభుత్వం అణచివేయలేదని, విద్య, ఉపాధి, భవిష్యత్తు కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Latest