- అవినీతి ఆరోపణలున్న మాజీ మేయర్ కు కూడా చైర్మన్ పదవా?
- పాత టీడీపీ వర్గానికే నామినేటెడ్ పదవుల పంపకమా?
- సుధారాణి నియామకం పై కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తి..
- ఏళ్లుగా కష్టపడిన నాయకులు, మహిళా నేతలకు మొండిచేయి
హనుమకొండ మహా ;
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితా ఇప్పుడు గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్‌లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. గతంలో బల్దియా కు మేయర్ గా పని చేసి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మేయర్ గుండు సుధారాణికి చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ సొంత పార్టీ నేతలే నిలదీస్తున్నారు.
అసలు వివాదం ఏమిటి?
వరంగల్ మేయర్ గా ఉన్న సమయంలో సుధారాణి పై కాంట్రాక్టర్లు, బిల్డర్లు, బల్దియా ముఖ్య విభాగాల నుంచి పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిందనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కాంట్రాక్టులు, నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి మహిళా నేతకు ఇప్పుడు కుడా చైర్మన్ పదవి ఇవ్వడం పై అసలైన కాంగ్రెస్ శ్రేణులు మండి పడుతున్నారు.
ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఆవేదన ఇలా ఉంది: “మేము 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసాం. లాఠీ దెబ్బలు తిన్నాం. ఇప్పుడు పదవులు మాత్రం పారాచూట్ నేతలకు, పాత టీడీపీ వర్గానికి దక్కుతున్నాయి”.
పాత టీడీపీ కోటరీకే పదవులా?
సుధారాణి కుటుంబం గతంలో టీడీపీలో కీలకంగా ఉంది. కీలకమైన పదవులు కూడా అనుభవించారు. తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కాంగ్రెస్లో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన పాత టీడీపీ వర్గానికే పదవులు పంచుతున్నారు. అసలైన కాంగ్రెస్ వారికి మొండిచేయి చూపిస్తున్నారు”* అనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
వరంగల్‌లోని పలువురు మహిళా కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళా నేతలకు అవకాశం ఇవ్వడం తప్పు కాదు. కానీ అర్హులైన వారు లేరా? ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారు లేరా?” అని ప్రశ్నిస్తున్నారు.
పద్మశాలి వర్గంలో నేతలే లేరా?
ఈ నియామకం వెనుక సామాజిక సమీకరణం కూడా చర్చకు వచ్చింది. సుధారాణి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత. ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడాని కే పదవి ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా, అదే వర్గంలోని కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడం లేదు. పద్మశాలి వర్గంలో సీనియర్ నేతలు, నిజాయితీగా పనిచేసిన మహిళా నేతలు ఉమ్మడి వరంగల్ లో ఎంతో మంది ఉన్నారు. వారిని కాదని వివాదాస్పద నేతకు పదవి ఇవ్వడం ఏమిటి? ఇది ఆ వర్గాన్ని అవమానించడమే” అని పద్మశాలి సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు.
బీసీ వర్గానికి మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్గొండ రమేష్, బత్తిని శ్రీనివాస్, వంటి వారి వర్గాల్లో కూడా ఈ అంశం పై గుసగుసలు మొదలయ్యాయి. “మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు” అని వాపోతున్నారు.
రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారిన నియామకం
ఒకవైపు పార్టీలో అంతర్గత పోరు, మరోవైపు ఈ నామినేటెడ్ పదవుల వివాదం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్, బీజేపీలు కూడా దీన్ని అస్త్రంగా చేసుకుని “కాంగ్రెస్ లో పదవులు అమ్ముడుపోతున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నాయి.
ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని, నియామకాల్లో పారదర్శకత పాటించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.








