- రాజ్యాంగ పరిరక్షణకు పార్టీలు, కులమతాలకు అతీతంగా పౌరులంతా ఏకం కావాలి.
- భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక,
- తమిళనాడు రాష్ట్రాల మాజీ కో-ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ , డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మాజీ కో-ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ ప్రతిని చేతబూని మాట్లాడిన ఆయన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు భగవద్గీత వంటి మార్గదర్శక గ్రంథాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు రాజ్యాంగం బలమైన పునాది వేసిందని డాక్టర్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర విపక్ష నేతలు రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రశ్నించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర, రాజ్యాంగబద్ధ సంస్థలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, సుప్రీంకోర్టుపై సైతం ఒత్తిడి తెచ్చేలా వ్యవహరించడం అనారోగ్యకరమని ఆయన అన్నారు.
పార్లమెంటు, శాసనసభల కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ, ప్రజలు చెల్లించే పన్నుల సొమ్మును విపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి రాకపోగా, కొన్ని స్వార్థ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి అసత్య ప్రచారాలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇటువంటి విచ్ఛిన్నకర ధోరణులను దేశ పౌరులంతా గమనించి, ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.
దేశమే పరమావధిగా పనిచేస్తూ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత భారత్’ లక్ష్యాల దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజ్యాంగ విలువలకు పూర్తి రక్షణ లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడూ తన పౌర ధర్మంగా రాజ్యాంగ పవిత్రతను కాపాడుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేందుకు అందరూ కలిసి రావాలని డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.







