Mahaa Daily Exclusive

  పురుష ఉద్యోగులకు15 రోజుల పితృత్వ సెలవులు..! ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తులకు విజయ్‌ ప్రభుత్వం సానుకూల స్పందన..

Share

  •  బిడ్డ పుట్టకముందైనా.. పుట్టిన ఆరు నెలల్లోనైనా వినియోగించుకునే వెసులుబాటు.
  • ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తులకు విజయ్‌ ప్రభుత్వం సానుకూల స్పందన.

చెన్నై, మహా:

తమిళనాడు ప్రభుత్వం పురుష ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. భార్య ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండటంతో పాటు నవజాత శిశువు సంరక్షణలో భాగస్వాములు కావడానికి వీలుగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి విజయ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో పురుష ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తరహా వెసులుబాటు కల్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పురుష ఉద్యోగులు శిశువు జన్మించడానికి 15 రోజుల ముందు నుంచి లేదా బిడ్డ జన్మించిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. మొత్తం 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందేందుకు అవకాశం కల్పించారు. ప్రసవ సమయంలో భార్యకు అవసరమైన సహకారం అందించడం, తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణలో బాధ్యత పంచుకోవడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల విషయంలో మాతృత్వ సెలవులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 365 రోజుల పాటు మాతృత్వ సెలవులు అందిస్తున్నారు. తాజాగా పురుష ఉద్యోగులకు కూడా పితృత్వ సెలవులు కల్పించడంతో కుటుంబ బాధ్యతల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగు వేసినట్లయింది.

పిల్లల పెంపకం తల్లి ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, తండ్రికి కూడా సమాన బాధ్యత ఉంటుందనే భావనకు ఈ నిర్ణయం ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలకూ సమయం కేటాయించేందుకు ఈ వెసులుబాటు ఉపయోగపడనుంది. తమిళనాడు ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Latest