Mahaa Daily Exclusive

  నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం షాక్‌..! భారత్‌లో పాక్‌ కంటెంట్‌కు నో..!

Share

  • నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం షాక్‌.
  •  భారత్‌లో పాక్‌ కంటెంట్‌కు నో!
  •  ఫవాద్‌ ఖాన్‌ వెబ్‌సిరీస్‌పై వివాదం.
  •  డిసెంబరు 4న విడుదలకు సన్నాహాలు.
  •  పాకిస్థాన్‌ కంటెంట్‌ ప్రసారం చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు.
  •  ప్రధాని మోదీకి లేఖలు రాసిన భారతీయ సినీ కార్మిక సంఘాలు.

న్యూఢిల్లీ, మహా:

పాకిస్థాన్‌లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర వినోద కార్యక్రమాలను భారత్‌లో ప్రసారం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో రూపొందిన ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ వెబ్‌సిరీస్‌ భారత్‌లో విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు పలు ఫిర్యాదులు, వినతులు అందాయి. దీంతో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2025 మే 8న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ వేదికలు, డిజిటల్‌ ప్రసార సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా అన్ని రకాల ప్రసార కంటెంట్‌ను భారతదేశంలో అందుబాటులో ఉంచకూడదని స్పష్టం చేసింది. దేశ భద్రత, సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

2025 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ కూడా కేంద్రానికి వివరణ ఇచ్చింది. పాకిస్థాన్‌లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను భారతీయ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచడం లేదని తెలిపింది. తాజాగా వివాదాస్పద వెబ్‌సిరీస్‌ విడుదల వార్తలు రావడంతో గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

డిసెంబరు 4న విడుదలకు సిద్ధమైన వెబ్‌సిరీస్‌

ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌, హనియా ఆమిర్‌, సనమ్‌ సయీద్‌, అహద్‌ రజా మీర్‌, హమ్జా అలీ అబ్బాసీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ వెబ్‌సిరీస్‌ ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ప్రముఖ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్‌ రచించిన అదే పేరుతో ఉన్న ఉర్దూ నవల ఆధారంగా దీనిని రూపొందించారు. మూడు తరాలకు చెందిన ప్రేమకథల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది. డిసెంబరు 4, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. అయితే భారత్‌లో ఈ సిరీస్‌ అందుబాటులోకి వస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

ప్రధాని మోదీకి సినీ సంఘాల లేఖలు

ఈ వెబ్‌సిరీస్‌ భారతదేశంలో విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్, ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. పాకిస్థాన్‌ కంటెంట్‌కు భారతీయ ఓటీటీ వేదికలపై అవకాశం కల్పించడం గతంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధమని పేర్కొన్నాయి. జాతీయ ప్రయోజనాలు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌ విడుదలను అడ్డుకోవాలని కోరాయి.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారతీయ సినీ పరిశ్రమలో పాకిస్థాన్‌ కళాకారులు పనిచేయకుండా ఎ ఐ సి డబ్ల్యూ ఎ నిషేధం విధించిన విషయాన్ని ఆ సంఘం తన లేఖలో ప్రస్తావించింది. పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌ కళాకారులు, అక్కడి కంటెంట్‌పై ఆంక్షలు విధించిందని గుర్తుచేసింది. పాకిస్థాన్‌ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన వినోద కార్యక్రమాలకు భారతదేశంలో స్థానం కల్పించడం సమంజసం కాదని అభిప్రాయపడింది.

మరోవైపు ఎఫ్ డబ్ల్యూ ఐ సి ఎ కూడా ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరింది. సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసి, పాకిస్థాన్‌ వెబ్‌సిరీస్‌ భారతదేశంలో ప్రసారం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

Latest