Mahaa Daily Exclusive

  తిరుపరంకుండ్రం దీపం వివాదంలో కొత్త మలుపు..!

Share

• అధికారుల ప్రకటనతో మాకు సంబంధం లేదు.
• ఆలయ పూజారుల స్పష్టీకరణ.
• సంప్రదించకుండానే పేర్లు వాడుకున్నారని ఆరోపణ.

మదురై, మహా:

తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆలయ సంప్రదాయాల నేపథ్యంలో ఇప్పటికే నెలకొన్న వివాదంలో తాజాగా ఆలయ పూజారులు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. కార్తీక దీపం వెలిగించే విషయమై ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు తేల్చిచెప్పారు. కనీసం తమను సంప్రదించకుండానే ప్రకటనలో తమ పేర్లను ప్రస్తావించారని పూజారులు ఆరోపించారు.

మేమెలాంటి లేఖ రాయలేదు.

తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించే అంశంపై ఆలయ డిప్యూటీ కమిషనర్‌కు గానీ, బోర్డు సభ్యులకు గానీ తాము ఎలాంటి లేఖ రాయలేదని పూజారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, నవంబరు 20న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపైనా అధికారులకు తాము ఎటువంటి అభిప్రాయం తెలియజేయలేదని వెల్లడించారు. ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటన గురించి తమకు ముందస్తు సమాచారమే లేదని, కేవలం మీడియా ద్వారానే ఆ విషయం తెలిసిందని వారు పేర్కొన్నారు.

పాత ఉత్తరప్రత్యుత్తరాలను ముడిపెట్టొద్దు.

గతంలో ఉచ్చిపిళ్లైయార్ ఆలయం వద్ద కార్తీక దీపం వెలిగించే విషయమై అధికారులతో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను ప్రస్తుత అంశానికి ముడిపెట్టడం సరికాదని పూజారులు హితవు పలికారు. నాటి సంప్రదింపులకు, ప్రస్తుతం కొండపై దీపం వెలిగించే వివాదానికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. మతపరమైన ఆచారాలు, ఆగమశాస్త్ర నియమాలతో పాటు పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామంటూ ఆలయ అధికారులు ఇటీవల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో పూజారుల తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

అధికారుల తీరుపై సందేహాలు.

పూజారుల అభిప్రాయాలను తీసుకున్నామని ఆలయ అధికారులు చెబుతుండగా, తమను అసలు ఎవరూ సంప్రదించలేదని పూజారులు పేర్కొనడం కొత్త వివాదానికి దారితీసింది. అసలు అధికారులు ఎవరితో సంప్రదింపులు జరిపారు? ఏ ప్రాతిపదికన పూజారుల పేర్లను ప్రకటనలో చేర్చారు? అన్న ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు, మరోవైపు ఆలయ సంప్రదాయాలు, అధికారుల ప్రకటనలు, పూజారుల ఖండనలతో తిరుపరంకుండ్రం కార్తీక దీపం వ్యవహారం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

Latest