• భూభారతి పేరుతో దోపిడీ విధానం మారలేదు.
• భూములు విముక్తి చేయకపోతే సడక్ నుంచి సదన్ వరకు పోరాటం.
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు.
హైదరాబాద్: మహా .
‘‘సొంత భూమిపై హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన మానవ హక్కు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మానవ హక్కులను సైతం తుంగలో తొక్కుతోంది. 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల, ప్రజల భూములన్నింటినీ తక్షణమే విముక్తి చేయాలి. లేదంటే సడక్ నుంచి సదన్ వరకు భారతీయ జనతా పార్టీ రాజీలేని పోరాటం చేస్తుంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు హెచ్చరించారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో రైతులు, మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద శనివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి–22ఏపై మహాధర్నా లో రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కిసాన్ మోర్చా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్రంలో ప్రజలను, ముఖ్యంగా రైతులు, మధ్యతరగతి కుటుంబాలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని రాంచందర్‌రావు మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ఒక బ్లాక్‌లిస్టెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వ్యవస్థను అప్పగించి అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఆ లోపాలను సరిదిద్దేందుకు భూభారతి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరింత ఘోరంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలోని భూములను తొలగించేందుకు 15 శాతం కమీషన్లు వసూలు చేశారని ఆరోపించిన రాంచందర్‌రావు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోదండరాం కమిటీ వంటి కమిటీల పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. తప్పు జరిగిందని ముఖ్యమంత్రి, మంత్రులే అంగీకరిస్తున్నప్పుడు అందుకు బాధ్యులైన ప్రభుత్వానికి శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు.
22ఏ వ్యవహారం రైతులకు మాత్రమే పరిమితం కాలేదని రాంచందర్‌రావు అన్నారు. మల్కాజిగిరి వంటి శివారు ప్రాంతాల్లో చిన్నచిన్న ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చివరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని నిర్మాణాలను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం శోచనీయమని అన్నారు.
ప్రభుత్వ భూములు, వక్ఫ్‌బోర్డు భూముల పేరుతో ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం కనిపిస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. ఇది కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు. ఏదైనా సర్వే నంబర్‌లో కొంత భాగంపై వివాదం ఉంటే, మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పేదలు, రైతుల భూములకు సంబంధించిన సమస్య కావడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని అన్నారు. భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని రాంచందర్‌రావు విమర్శించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారులను ఆశ్రయిస్తున్నా స్పందన లభించడం లేదని, కలెక్టర్లు కూడా బాధితులకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. భూమి సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది తమ భూములను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని రాంచందర్‌రావు పేర్కొన్నారు. పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు వంటి అవసరాల కోసం సొంత భూమిని విక్రయించలేకపోవడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేకపోవడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. సొంత ఆస్తిపై హక్కును అడ్డుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
గత బీఆర్‌ఎస్ పాలనను కూడా రాంచందర్‌రావు విమర్శించారు. అప్పట్లో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్‌రెడ్డి అండ్ బ్రదర్స్ ప్రభుత్వం మాత్రమే బాగుపడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని రాంచందర్‌రావు ఆరోపించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలను కేవలం రెండు రోజులకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలు నిర్వహించే ధర్నాలకు కూడా అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.
ఇదే కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెండు రోజుల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టించిందని అన్నారు. చివరకు కోర్టును ఆశ్రయించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు, శాంతిభద్రతల కారణాలను చూపుతూ దీక్షను ఒక్కరోజుకే పరిమితం చేశారని ఆరోపించారు.
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదివారం అదే ప్రాంతంలో టెంట్ వేసుకుని ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నవారు పాలన చేయాలి కానీ ప్రతిపక్షం చేయాల్సిన ధర్నాలు, దీక్షలు అధికార పార్టీ చేయడం తాను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని అన్నారు. బీజేపీ కోరిన అనుమతిని నిరాకరించి అదే ప్రాంతంలో అధికార పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిందని సంబరాలు చేసుకుంటోందని, అయితే ఈ వెయ్యి రోజుల్లో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనందుకా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించనందుకా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకా సంబరాలు చేసుకుంటున్నారని నిలదీశారు.
రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి, దోపిడీ, కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి దెబ్బతిన్నదని, అప్పులు పెరిగిపోయాయని, రాష్ట్రంపై లక్షల కోట్ల రూపాయల బకాయిల భారం పడిందని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఉద్యోగులు, ప్రభుత్వ వ్యవస్థలకు జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
ధరణి స్థానంలో భూభారతి తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చెప్పారని మహేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు పేరు మాత్రమే మారిందని, దోపిడీ విధానం మాత్రం మారలేదని ఆరోపించారు. అదే విధానం, అదే ఫార్మాట్‌తో భూభారతిని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల భూములను సమస్యల్లోకి నెడుతున్నారని విమర్శించారు.
భూభారతి కారణంగా కోట్ల ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయని చెప్పారు. ఏ ప్రాతిపదికన భూములను 22ఏలో చేర్చారు? ఏ ప్రాతిపదికన కొన్ని భూములను రాత్రికి రాత్రే 22ఏ నుంచి తొలగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
22ఏ జాబితా వ్యవహారంపై బీజేపీ అసెంబ్లీలో ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తిందని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బాధితులు తమ భూములు 22ఏలో ఉన్నాయని అధికారులను ఆశ్రయిస్తున్నప్పటికీ న్యాయం జరగడం లేదని ఆరోపించారు. భూములను 22ఏలో చేర్చడం, తిరిగి తొలగించడం వంటి వ్యవహారాల్లో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారంపైనా మహేశ్వర్‌రెడ్డి పలు ఆరోపణలు చేశారు. మంత్రి సొంత కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బదలాయింపు జరుగుతున్నాయని బీజేపీ ఆధారాలతో ప్రశ్నించిందని అన్నారు. రెవెన్యూ శాఖ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి వ్యాపార ప్రయోజనాలను కొనసాగించడం ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కాదా అని ప్రశ్నించారు.
22ఏలో ఉన్న భూముల సమస్య పరిష్కారానికి బాధితుల నుంచి ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ అడుగుతున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారం ఏమిటో మంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భూమి సమస్య పరిష్కారం కోసం ప్రజల నుంచి ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయంటే దాని వెనుక ఉన్న వ్యవస్థపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ ప్రకారం ఆస్తి హక్కుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అయితే 22ఏ నిబంధనలను ఉపయోగించి ప్రజల ఆస్తి హక్కులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ‘‘రైట్ టు ప్రాపర్టీ కాస్తా రేట్ టు ప్రాపర్టీగా మారిపోయింది’’ అంటూ ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు.
ధరణి అవినీతిపై విచారణ చేస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని మహేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ధరణిపై సమగ్ర విచారణ ఎందుకు చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలపై ఇప్పటివరకు ఎన్ని విచారణలు పూర్తయ్యాయో, ఎన్ని కేసుల్లో తుది ఫలితాలు వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ధరణి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ తదితర అంశాల్లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మహేశ్వర్‌రెడ్డి ప్రస్తావించారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఏదైనా చీకటి ఒప్పందం ఉందా అని నిలదీశారు.
కాళేశ్వరం విషయంలోనూ ముఖ్యమంత్రి మాటలకు, చర్యలకు పొంతన లేదని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో ఆరోపించిన ముఖ్యమంత్రి ఇప్పుడు కేవలం మూడు బ్యారేజీలకు సంబంధించిన సుమారు రూ.7 వేల కోట్ల వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించారని అన్నారు. మొత్తం వ్యవహారాన్ని ఎందుకు సీబీఐకి అప్పగించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు భూములు, అభివృద్ధి, ఉద్యోగాలు, ఎన్నికల హామీల అమలు, అవినీతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అయితే సమాధానం చెప్పలేని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు.








