Mahaa Daily Exclusive

  క్రికెటర్లకు ప్రత్యేక వసతులు కుదరవు..! ఐవోఏ సీఈఓ రఘరామ్‌ అయ్యర్..

Share

• బీసీసీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన ఐవోఏ.
• సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటే అభ్యంతరం లేదు.
• ఐవోఏ సీఈఓ రఘరామ్‌ అయ్యర్.

న్యూఢిల్లీ:మహా.

ఆసియా క్రీడల్లో భారత క్రికెటర్లకు ప్రత్యేక వసతి సదుపాయాలు కల్పించాలన్న బీసీసీఐ విజ్ఞప్తికి భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) సానుకూలంగా స్పందించలేదు. ఆసియా క్రీడల్లో పాల్గొనే ఇతర క్రీడాకారులకు వర్తించే నిబంధనలే క్రికెటర్లకూ వర్తిస్తాయని ఐవోఏ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే క్రికెటర్ల కోసం బీసీసీఐ సొంతంగా వసతి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐవోఏ సీఈఓ రఘరామ్‌ అయ్యర్‌ స్పష్టం చేసినట్లు కథనాలు వెల్లడించాయి.

జపాన్‌ వేదికగా శనివారం నుంచి ఆసియా క్రీడల ఏర్పాట్లపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వసతి సదుపాయాలు, క్రికెట్‌ మైదానంలోని పిచ్‌ నాణ్యతపై ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా క్రీడాకారులు బస చేసేందుకు ఏర్పాటు చేసిన గదులు చాలా చిన్నగా ఉన్నాయన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు వసతి విషయంలో బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు కోరినట్లు సమాచారం.

క్రికెటర్ల వసతి ఏర్పాట్లకు సంబంధించి బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమిన్‌ తమను సంప్రదించినట్లు ఐవోఏ సీఈఓ రఘరామ్‌ అయ్యర్‌ తెలిపారు. ఈ అంశంపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల సందర్భంగా క్రికెటర్లకు అందుబాటులో ఉండే సదుపాయాలను స్వయంగా పరిశీలించేందుకు జపాన్‌కు ప్రత్యేక బృందాన్ని పంపించాలన్న బీసీసీఐ ఆలోచనకు ఐవోఏ అంగీకరించినట్లు తెలిపారు.

జపాన్‌లో నిర్వాహకులు కల్పిస్తున్న వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించిన తర్వాత వాటిని బీసీసీఐ ఉపయోగించుకోవాలా? లేక క్రికెటర్ల కోసం స్వయంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలా? అన్నది బీసీసీఐ నిర్ణయించుకోవచ్చని అయ్యర్‌ స్పష్టం చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. బీసీసీఐ సొంతంగా వసతి సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే ఐవోఏకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన వెల్లడించారు.