Mahaa Daily Exclusive

  కేసీఆర్‌ చెప్పింది ఒకటి..! తాతా మధు చేసింది మరొకటి..! తాతా మధుపై చర్యలకు కాంగ్రెస్‌ డిమాండ్‌..

Share

  •  తాతా మధు చేసింది మరొకటి!
  •  తొలిరోజే బీఆర్‌ఎస్‌లో కొత్త తలనొప్పి.
  •  స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలతో దుమారం.
  •  తాతా మధుపై చర్యలకు కాంగ్రెస్‌ డిమాండ్‌.

హైదరాబాద్, మహా.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేసి సభకు పంపినప్పటికీ.. తొలిరోజే చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగడం, పోలీసులతో వాగ్వాదం, తోపులాటలతో మొదలైన వివాదం.. చివరకు ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యల చుట్టూ తిరిగింది.

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్‌ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్ల టీషర్టులు, వాటిపై నినాదాలతో వచ్చిన సభ్యులను నిలువరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కొందరు బీఆర్‌ఎస్‌ సభ్యులు టీషర్టులు విప్పేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు పలువురు ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజే రాజకీయ వాతావరణం వేడెక్కింది.

అయితే ఈ పరిణామాలన్నింటినీ పక్కకు నెట్టి.. ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారం ప్రధాన చర్చగా మారింది. పోలీసుల అడ్డంకిపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో ఆయన అనుచిత పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించే సందర్భంలో స్పీకర్‌ను ఉద్దేశించేలా వ్యాఖ్యలు వెళ్లాయని కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా కాంగ్రెస్‌ సభ్యులు మండిపడ్డారు. ముఖ్యంగా దళిత స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పలువురు కాంగ్రెస్‌ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను పరామర్శించి, ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాతా మధుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ గతంలో తనతో పాటు సంపత్‌కుమార్‌ విషయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. తమపై ఆరోపణలు వచ్చిన సమయంలో సభ్యత్వాల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు స్పీకర్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితి వస్తే బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ వర్గాలు మాత్రం తాతా మధు వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసుల తోపులాటలో తన దుస్తులను లాగడంతో ఆగ్రహానికి గురై అలా మాట్లాడారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ వివరణపై కాంగ్రెస్‌ సభ్యులు సంతృప్తి చెందడం లేదు. శాసనసభ స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించినట్లయితే దానిని ఏ కారణంతోనూ సమర్థించలేమని వారు స్పష్టం చేస్తున్నారు.

తొలిరోజు అసెంబ్లీలో ప్రభుత్వ హామీలు, ప్రజా సమస్యలు, ప్రతిపక్షాల డిమాండ్లపై జరగాల్సిన చర్చ కంటే తాతా మధు వ్యాఖ్యలే రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో బీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్దేశం పక్కకు వెళ్లి.. ఆ పార్టీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలే ప్రధాన అంశంగా మారాయి.

ఇప్పటికే ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా తాతా మధు వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు మరో ఇబ్బందికర అంశంగా మారాయి. కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో క్రమశిక్షణా సంఘం నివేదిక సిద్ధమైనట్లు, స్పీకర్‌ వివరణ కూడా తీసుకున్నట్లు వచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాతా మధు వ్యవహారం కూడా శాసనసభలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అధిష్ఠానం దృష్టిలో పడేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కాంగ్రెస్‌ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కేటీఆర్‌, కేసీఆర్‌లను ప్రసన్నం చేసుకునేందుకు, రాజకీయంగా వైరల్‌ అయ్యేందుకు కొందరు నేతలు హద్దులు దాటుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇవి రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలేనని గమనించాల్సి ఉంది.

అసెంబ్లీ సమావేశాల తొలి రోజే చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య భవిష్యత్‌ సమావేశాలు ఎంతటి వాడివేడిగా సాగబోతున్నాయన్న దానికి సంకేతంగా మారాయి. ఒకవైపు పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ న్యాయపోరాటం చేస్తుండగా.. మరోవైపు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు ఆ పార్టీపై రాజకీయ ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, శాసనసభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.