Mahaa Daily Exclusive

  అసెంబ్లీ ఆవరణలో విషాదం…

Share

  • అసెంబ్లీ ఆవరణలో విషాదం.
  • ఐఏఎస్ అధికారి పీఎస్ రాజు ఆకస్మిక మృతి.
  • విధుల్లో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిన రాజు.
  • సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.
  • ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి.
  • సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర విషాదం.

హైదరాబాద్, మహా:

తెలంగాణ శాసనసభ ఆవరణలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజు ఆకస్మికంగా మృతి చెందారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధులకు హాజరైన ఆయన.. శాసనసభ ఆవరణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.

రాజు కుప్పకూలిన విషయాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆయనకు అక్కడికక్కడే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం రాజును మెరుగైన వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే రాజు మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి నిర్ధారించినట్లు సమాచారం. విధుల్లో ఉండగానే ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో శాసనసభ ఆవరణలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రాజు మృతితో అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు కూడా ఆయన అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహచరులతో సన్నిహితంగా ఉండే రాజు ఆకస్మికంగా మృతి చెందడం తమను కలచివేసిందని పలువురు పేర్కొన్నారు.

రాజు కుటుంబ సభ్యులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విధుల్లో ఉండగానే జరిగిన ఈ విషాద ఘటన పలువురిని కలిచివేసింది.