Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌–బీఆర్ఎస్‌ది ‘నువ్వు కొట్టినట్లు….

Share

కాంగ్రెస్‌–బీఆర్ఎస్‌ది ‘నువ్వు కొట్టినట్లు..

* నేను ఏడ్చినట్లు’ రాజకీయం.

* ప్రజా సమస్యలను గాలికొదిలి అసెంబ్లీలో డ్రామాలు.

* నేతల భాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

* 22A భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీరు, ఉద్యోగాలపై చర్చించాలి.

* డైవర్షన్ రాజకీయాలు ఆపండి బండి సంజయ్.

 

హైదరాబాద్, మహా:

 

తెలంగాణ శాసనసభ సమావేశాల తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇరు పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరతీస్తున్నాయని ఆరోపించారు. ‘నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా’ అన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం లాలూచీ రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని, కొందరు నేతలు ఉపయోగిస్తున్న బజారు భాషను చూసి నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన శాసనసభలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు.

 

స్పీకర్‌పై వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు

 

శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ జీర్ణించుకోలేరని బండి సంజయ్ అన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

తాతా మధు తదితరుల వ్యవహారంలోనూ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ పలుకుబడితో ఎవరినీ తప్పించకూడదని సూచించారు.

 

కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోవడంపై ప్రశ్నలు

 

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకని నిలదీశారు. ప్రజా సమస్యలపై చర్చ జరిగే శాసనసభకు ప్రతిపక్ష నాయకత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

22A భూములపై ప్రజలకు ఇబ్బందులు

 

రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ అన్నారు. భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో మంత్రులు, అధికార పార్టీ నేతలు వేల కోట్ల రూపాయల భూదందాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, భూముల వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల ఆందోళన

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక చదువులు, ఉద్యోగ అవకాశాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. రక్తం కారేలా కొట్టడం దారుణమని విమర్శించారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై అధిక బలప్రయోగం చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని సూచించారు.

 

రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై చర్చ ఏది?

 

సాగునీరు అందక దక్షిణ తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉందని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల కాక ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఇలాంటి కీలక అంశాలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమయాన్ని ఒకే అంశంపై రెండు రోజులపాటు చర్చించడంతో వృథా చేయడం సరికాదని విమర్శించారు. ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరిపి పరిష్కార మార్గాలను సూచించాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఉందన్నారు.

 

‘కాంగ్రెస్‌–బీఆర్ఎస్‌ దొందూ దొందే’

 

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే తీరులో వ్యవహరిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇరు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లిస్తున్నాయని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు కాకుండా పాలన, ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

 

అసెంబ్లీ వేదికగా రాజకీయ డ్రామాలు, డైవర్షన్ రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించాలని బండి సంజయ్ హితవు పలికారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, 22A భూములు, సాగునీరు, ఉద్యోగాలు, ఉద్యోగుల సమస్యలు, హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.