బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం.
* అసెంబ్లీలో కీలక తీర్మానం.
* స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై అధికార పక్షం ఆగ్రహం.
* కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
* దళిత సమాజాన్ని, తెలంగాణ యువతను తక్కువగా అంచనా వేయొద్దు.
* ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు.
* మంత్రి రాజనర్సింహ.
హైదరాబాద్, మహా:
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ అంశంపై శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలతో పాటు అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు, నేతలు వ్యవహరించిన తీరుపైనా అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇద్దరు ఎమ్మెల్సీలు స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ తరఫున తీవ్రంగా పరిగణించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానంలో కోరారు. అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు, నేతలు ప్రవర్తించిన తీరుపై విపక్ష నేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడిన మంత్రి దామోదర రాజనర్సింహ.. ఎస్సీల చరిత్ర కేవలం ఒక వర్గానికి సంబంధించినది కాదని, అది జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. దళిత సమాజానికి అవమానాలు, పోరాటాలు కొత్తకావని పేర్కొన్నారు. దళితుల చరిత్ర పోరాటం, ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు.
‘ఆత్మగౌరవమే మా అలంకారం.. ఆత్మగౌరవమే మా స్ఫూర్తి’ అంటూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. అదే ఆత్మగౌరవంతో తాము ఈ స్థాయికి వచ్చామని అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ యువతను, ముఖ్యంగా దళిత సమాజాన్ని తక్కువగా అంచనా వేయొద్దని దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను, అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
స్పీకర్ పదవి ఏ ఒక్క కులానికో, మతానికో సంబంధించినది కాదని మంత్రి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ నేతల అహంకారం మాత్రం తగ్గలేదని విమర్శించారు.
మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన తీర్మానానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పూర్తిగా మద్దతు తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, వాటి గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో తీర్మానం ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎమ్మెల్సీలపై చర్యలకు సంబంధించిన అధికారిక తీర్మాన ప్రతిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపనున్నారు. అనంతరం శాసనమండలిలో తీర్మానంపై తదుపరి ప్రక్రియ కొనసాగనుంది. మండలి ఆమోదం పొందిన తర్వాత నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉంది.
స్పీకర్‌పై వ్యాఖ్యల వ్యవహారం ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసింది.








