ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.
* ఎగుమతులు పెంచడమే లక్ష్యం.
* తెలంగాణ–ఫిలిప్పీన్స్ వాణిజ్య విస్తరణకు అడుగులు.
* బియ్యం, విత్తనాలు, మాంస ఉత్పత్తులపై చర్చ.
* నాణ్యత, పోటీ ధరలు, సకాలంలో సరఫరా.
* అంతర్జాతీయ మార్కెట్‌తో రైతులకు లాభం.
* పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ:మహా.
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను భారీగా పెంచడంతో పాటు ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు స్థిరమైన, లాభదాయకమైన అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో మంగళవారం ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ దేశ క్యాబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు పెంచడంతో పాటు ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించే అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
భారత్‌లో అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. భారీ పరిమాణంలో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణకు ఉందని తెలిపారు. ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసే అనుభవం రాష్ట్రానికి ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదనపై ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి లారెల్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి మరింత పెద్ద పరిమాణంలో బియ్యం కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఆయన వెల్లడించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.
సంబంధిత ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే విధానంపైనా సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. ఫిలిప్పీన్స్‌లో బియ్యం దిగుమతులకు గణనీయమైన డిమాండ్ ఉండటంతో పాటు అంతర్జాతీయంగా బియ్యం సరఫరా చేసే దేశాల పరిధిని విస్తరించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు.
పోటీ ధరలు, నాణ్యతలో విశ్వసనీయత, నిర్ణీత సమయంలో పెద్ద మొత్తంలో సరఫరా చేయగల సామర్థ్యంతో తెలంగాణ ఫిలిప్పీన్స్‌కు దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ రైతులు, రైస్ మిల్లర్లు, ఎగుమతిదారులకు ప్రయోజనకరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
బియ్యంతో పాటు విత్తనాలు, మాంస ఉత్పత్తులు
బియ్యం ఎగుమతులతో పాటు తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంపైనా ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణకు బలమైన సామర్థ్యం ఉందని మంత్రి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.
అయితే ఎగుమతులకు సంబంధించిన శానిటరీ, ఫైటోశానిటరీ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు, అనుమతులు, ఇతర నియంత్రణ అంశాలను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో కలిసి ఈ అంశాలపై అధ్యయనం చేసి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లతో రైతులకు ప్రయోజనం
తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు కల్పిస్తే రైతులతో పాటు రైస్ మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చెందిన అనేక వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రైతులు ఉత్పత్తి చేసే పంటలకు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా స్థిరమైన డిమాండ్ ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎగుమతి మార్కెట్లను విస్తరించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ఫిలిప్పీన్స్‌కు బియ్యం, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దీర్ఘకాలంపాటు విశ్వసనీయంగా సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక నైపుణ్యం తెలంగాణకు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను అంతర్జాతీయ వ్యవసాయ ఎగుమతుల కేంద్రంగా మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర రైతులకు స్థిరమైన, లాభదాయకమైన మార్కెట్లను సృష్టించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.








