Mahaa Daily Exclusive

  కోర్టు ఉత్తర్వులు అమలు చేయరా?.

Share

కోర్టు ఉత్తర్వులు అమలు చేయరా?.

* సీనియర్ ఐఏఎస్ అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.

* బెయిలబుల్ వారెంట్లు ఉండగా విదేశాలకు ఎలా వెళ్తారు?.

* ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఏంటి. హైకోర్టు

 

హైదరాబాద్, మహా:

 

కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో జాప్యం చేయడంతో పాటు విచారణకు సక్రమంగా హాజరుకాని సీనియర్ ఐఏఎస్ అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో బెయిలబుల్ వారెంట్లు అమల్లో ఉండగా అధికారులు విదేశీ పర్యటనలకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. విమానాశ్రయంలోనే వారిని అరెస్టు చేసి ఉంటే ప్రభుత్వానికి, సంబంధిత శాఖకు ఎలాంటి పరిస్థితి ఎదురయ్యేదో ఆలోచించారా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

 

భూసేకరణ ప్రక్రియలో బాధితులకు చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి ఈ వ్యవహారం కోర్టు ముందుకు వచ్చింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు నిర్ణయించిన పరిహారంలో 50 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరగడంతో పాటు బాధితులకు పరిహారం అందకపోవడంతో వారు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

 

ఈ కేసు విచారణ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు–భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్‌లకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అనంతరం విచారణకు అధికారులు హాజరుకాకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

‘బెయిలబుల్ వారెంట్లు ఉండగా విదేశాలకు ఎలా వెళ్తారు?’

 

అధికారుల గైర్హాజరుపై ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా అధికారులకు తీవ్ర పని ఒత్తిడి ఉందని, అందువల్ల కోర్టుకు హాజరు కాలేకపోయారని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి విదేశీ పర్యటనలో ఉన్నారని వివరించారు.

 

దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఫారం-1 నోటీసులు, బెయిలబుల్ వారెంట్లు అమల్లో ఉన్న సమయంలో అధికారులు విదేశాలకు వెళ్లడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే క్రమంలో విమానాశ్రయంలోనే అధికారులు అరెస్టయి ఉంటే ప్రభుత్వానికి, సంబంధిత శాఖకు ఎలాంటి గౌరవం మిగిలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పరిహారం చెల్లించకుండా ‘బడ్జెట్ లేదు’, ‘నిధులు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తాం’ వంటి సమాధానాలు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని స్పష్టం చేసింది.

 

పరిహారం పూర్తిగా చెల్లించామని కోర్టుకు వెల్లడి

 

అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు స్పందిస్తూ.. బాధితులకు ఇటీవల పరిహారం మొత్తాన్ని పూర్తిగా చెల్లించినట్లు కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

అధికారులు విచారణకు గైర్హాజరైనందుకు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. పరిహారం చెల్లింపు పూర్తయిన నేపథ్యంలో, అధికారుల వివరణను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ముగించింది.

 

అయితే కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం, అధికారుల గైర్హాజరు, వారెంట్లు అమల్లో ఉన్న సమయంలో విదేశీ పర్యటన వంటి అంశాలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి.