Mahaa Daily Exclusive

  పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు….

Share

పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు.

* లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం.

* మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనకు నిరసన.

* శివ ప్రతాప్ శుక్లాను కలవనున్న బీఆర్ఎస్ నేతలు.

 

హైదరాబాద్:మహా.

 

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. అసెంబ్లీ గేటు వద్ద నిరసన సందర్భంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది.

 

ఈ మేరకు బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల ప్రతినిధి బృందం బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలవనుంది. అసెంబ్లీకి వెళ్తున్న ప్రతిపక్ష సభ్యులను పోలీసులు అడ్డుకోవడం, నిరసన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు వివరించనున్నారు.

 

ముఖ్యంగా మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిరసన సందర్భంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులపై భౌతికంగా దాడికి పాల్పడ్డారని పేర్కొంటూ, ఘటనకు సంబంధించిన వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది.

 

ఎమ్మెల్యేల హక్కులపై ఫిర్యాదు

 

ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగబద్ధమైన హక్కులకు విఘాతం కలిగించడమేనని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష సభ్యులపై పోలీసులను ఉపయోగించి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.

 

అసెంబ్లీ గేటు వద్ద జరిగిన పరిణామాలు, మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సమగ్రంగా వివరించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

రాజకీయంగా వేడెక్కిన వాతావరణం

 

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, 22A భూములు, రైతులు, నిరుద్యోగులు తదితర అంశాలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

 

ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద నిరసనలు, పోలీసులతో వాగ్వాదాలు, మహిళా ఎమ్మెల్యేల వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపింది. తాజాగా గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

 

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ఫిర్యాదు అందజేసి, ప్రజాప్రతినిధుల హక్కులను పరిరక్షించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకునేలా జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కోరనుంది. గవర్నర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.