Mahaa Daily Exclusive

  కేసీఆర్ క్షమాపణ చెబితే హుందాతనం పెరిగేది….

Share

కేసీఆర్ క్షమాపణ చెబితే హుందాతనం పెరిగేది.

• స్పీకర్‌పై అనుచిత భాష సరికాదు.

• తాతా మధు వ్యాఖ్యలను తప్పుబట్టిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

 

హైదరాబాద్, మహా:

 

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా స్పందించారు. శాసనసభాపతి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత భాషలో వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

 

మంగళవారం హైదరాబాద్‌లో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను తప్పుబట్టారు. స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ సభాపతి స్థానాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు.

 

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా శాసనసభకు హాజరై తమ పార్టీ ఎమ్మెల్సీ చేసిన తప్పును క్షమించాలని కోరితే ఆయన హుందాతనం మరింత పెరిగేదని కూనంనేని వ్యాఖ్యానించారు. తప్పు జరిగిందని అంగీకరించి క్షమాపణ కోరడం వల్ల నాయకుడి స్థాయి తగ్గదని, పైగా గౌరవం పెరుగుతుందని అన్నారు.

 

శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు తావివ్వడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు మంచిది కాదని కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజల తరఫున చట్టసభకు ఎన్నికైన ప్రతినిధులు తమ మాటలు, ప్రవర్తన విషయంలో సంయమనం పాటించాలని సూచించారు.