- పౌరసరఫరాల శాఖ మేనేజర్ వద్ద భారీగా ఆస్తులు గుర్తింపు.
- ఏకకాలంలో ఇళ్లు, కార్యాలయాలు, బినామీ నివాసాల్లో తనిఖీలు.
మహబూబాబాద్,మహా.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారం, ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాల్లో శుక్రవారం ముమ్మర సోదాలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పౌరసరఫరాల శాఖ విభాగంలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసంశెట్టి నరసింహారావు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ప్రభాకర్‌రావు కార్యాలయాలతో పాటు వారి బినామీ నివాసాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగాయి.
ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రమేశ్ మీడియాకు వెల్లడించారు. గత 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నరసింహారావు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారని, ఆయన ఏ ప్రాంతంలో పనిచేసినా అక్కడ అవినీతి ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, నివాసాలు, బంధువులు ಹಾಗೂ బినామీల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు కొనసాగిన తనిఖీల్లో నరసింహారావుకు ఖమ్మంలో రెండు విలాసవంతమైన భవనాలు, హైదరాబాద్‌లో పలు విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన వద్ద నుంచి 4 మద్యం బాటిళ్లు, రూ. 19 వేల నగదుతో పాటు కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాత పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారు లు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








