Mahaa Daily Exclusive

  వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి.

Share

• ఈ నెల 12న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్న సీఎం.

• వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్ డిమాండ్‌పై ప్రత్యేక సమీక్ష.

• రైతులను ఆదుకునేందుకు ముమ్మర కార్యాచరణ.

హైదరాబాద్‌, మహా.

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, నమోదవుతున్న వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావడం, పలు మండలాల్లో కరువు ఛాయలు అలుముకోవడం, దీనివల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బతులపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, తాగునీటి సరఫరా, విద్యుత్ వినియోగం డిమాండ్‌తో పాటు వర్షాభావ ప్రాంతాల్లో తక్షణమే చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు.

వందలాది మండలాల్లో వర్షాభావ ముప్పు..

రాష్ట్రంలో సాధారణం కంటే సుమారు 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 235కి పైగా మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పంటల పరిస్థితి, భూగర్భ జలాల అడుగంటుతున్న తీరుపై సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశాలపై విస్తృతంగా చర్చించగా, తాజా సమావేశంలో క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

సాగు, తాగునీటికే మొదటి ప్రాధాన్యం..

వర్షాభావ పరిస్థితులు మరింత ముదిరితే తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే కాలంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రైతన్నలకు సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు తగిన దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సహాయం, రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

వర్షాభావ ప్రాంతాల్లో మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, వివిధ వర్గాల నుంచి వస్తున్న సలహాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.