Mahaa Daily Exclusive

  ఏపీ స్థానిక ఎన్నికలకు..సుప్రీం క్లియర్…

Share

  • ఏపీ స్థానిక ఎన్నికలకు
  • సుప్రీం క్లియర్
  • నేడు రిజర్వేషన్లపై చంద్రబాబు అత్యవసర భేటీ
  • ప్రభుత్వం గెజిట్ ఇస్తేనే ఎన్నికల నోటిఫికేషన్ : ఈసీ ప్రకటన

అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. ఏపీ హైకోర్టు విధించిన ఆరు వారాల గడువులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్నికల ఆలస్యానికి తావులేకుండా ముందుకు వెళ్లాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘ ప్రక్రియ పూర్తయితే, కొత్తగా రూపొందించిన సమగ్ర ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ నోటిఫికేషన్ సమయానికి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పూర్తి కాకపోతే, ప్రస్తుత పాత ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.

చంద్రబాబు అధ్యక్షతన అత్యవసర భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు తగిన న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై ఉన్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగ పరిధిలో బీసీలకు సాధ్యమైనంత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధమైన హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ అంశంపై చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు శనివారం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ ఏకసభ్య కమిషన్ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు తెలిపారు. కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ నిబంధనలను సమగ్రంగా పరిశీలించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ప్రభుత్వం గెజిట్ ఇస్తే నోటిఫికేషన్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే, ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ‘సర్’ ప్రక్రియ తర్వాత చేపట్టిన ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు ఖరారైతే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఆ తర్వాతే స్థానిక నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల ఆధారంగా ఈ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉంటామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.