- సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.
- బీసీలకు 34% రిజర్వేషన్లు అడ్డుకున్నది జగన్ అండ్ కోనేనంటూ ధ్వజం.
ప్రకాశం,మహా.
స్థానిక సంస్థల ఎన్నికలపై వైకాపా వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా ‘రెండు నాలుకల ధోరణి’కి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని, రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైకాపా ఓడిపోతే కనీసం వచ్చే నాలుగు ఓట్లు కూడా దక్కవనే భయంతోనే ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ నేతలు ఇళ్లల్లో పడుకుంటారని జగన్ భయపడుతున్నారని విమర్శించారు.
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, తాను దాన్ని 34 శాతానికి పెంచానని గుర్తుచేశారు. కానీ, గత జగన్ హయాంలో ఆ రిజర్వేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసి, సుమారు 16,800 మంది స్థానిక నాయకుల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. “ఇక్కడ ఉంది 2014 సీబీఎన్ కాదు.. 1995 సీబీఎన్” అంటూ సీఎం హెచ్చరించారు. చట్టప్రకారం తాము బీసీలకు మళ్లీ రిజర్వేషన్లు కల్పిస్తుంటే.. కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించి వాటిని అడ్డుకున్నది జగన్ అండ్ కో కాదా అని నిలదీశారు. వెనుకబడిన వర్గాలంటే వైకాపాకు మొదటి నుంచి గిట్టదని, అయితే టీడీపీకి బీసీలే వెన్నెముక అని స్పష్టం చేశారు. ఒకవేళ కోర్టు తీర్పుల కారణంగా రిజర్వేషన్లలో ఇబ్బందులు ఎదురైనా, పార్టీ పరంగా బీసీలకు 34 శాతానికి మించి ఎక్కువ స్థానాలు కేటాయించి గెలిపించుకునే బాధ్యత తనదేనని తేల్చిచెప్పారు. ఒకపక్క ‘సర్’ ప్రక్రియ వద్దంటూనే, మరోపక్క ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు వద్దు అంటూ కోర్టుల చుట్టూ తిరగడం వైకాపా ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
ఏపీని డ్రోన్ టెక్నాలజీ హబ్‌గా మారుస్తాం..
రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ వేగంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధిలో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుందని, భవిష్యత్‌లో యుద్ధానికి అవసరమైన డ్రోన్లు సైతం ఇక్కడే తయారయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి, కావేరి నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాలు, ఐదు జీవనాధారాలు కలుస్తాయని చెప్పారు. రామాయపట్నంలో రూ.1.50 లక్షల కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సీఎం.. గోవాను మించేలా సూర్యలంక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.








