- బెంగళూరు సీఓఈలో ఏడాదిలోగా చికిత్స పొందిన 32 మంది టాప్ ప్లేయర్లు.
- గాయాల నిర్వహణ బడ్జెట్‌ను ఏకంగా రూ.127 కోట్లకు పెంచిన బోర్డు.
- ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర కసరత్తు
న్యూఢిల్లీ, మహా.
భారత క్రికెటర్లను వరుసగా వేధిస్తున్న గాయాల సమస్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్రంగా దృష్టి సారించింది. గత ఏడాది కాలంలో టీమిండియాకు చెందిన సుమారు 32 మంది ప్రముఖ ఆటగాళ్లు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పునరావాసం (రీహాబ్), వైద్య చికిత్స పొందినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసిన తర్వాత సీఓఈ కేంద్రానికి రిపోర్ట్ చేస్తున్న ఆటగాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం బోర్డును ఆందోళనకు గురిచేస్తోంది.
ఆటగాళ్లపై పడుతున్న పనిభారాన్ని (వర్క్‌లోడ్) క్రమబద్ధీకరించాలని, గాయాల తీవ్రతను తగ్గించి వారిని త్వరగా పూర్తి ఫిట్‌నెస్‌లోకి తీసుకువచ్చేందుకు గాను బీసీసీఐ తమ ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. గతేడాది కేవలం రూ.92 కోట్లుగా ఉన్న ఈ బడ్జెట్‌ను, ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.35 కోట్లు పెంచి రూ.127 కోట్లకు చేర్చింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వంటి వారు ఆటగాళ్ల వరుస గాయాలపై ఆందోళన వ్యక్తం చేయడంతో బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సైతం ఇటీవల ఫిట్‌నెస్, రీహాబ్ ప్రక్రియల కోసం సీఓఈని సందర్శించడం గమనార్హం.
క్రమం తప్పకుండా రీహాబ్‌కు వెళ్తున్న స్టార్స్..
జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులు తరచూ సీఓఈకి వెళ్తుంటారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆటగాళ్ల శరీరాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గిస్తూ, కీలక టోర్నీలకు వారు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండేలా ఆధునిక వైద్య సదుపాయాలు, ప్రత్యేక పునరావాస కార్యక్రమాలను అందిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.








