Mahaa Daily Exclusive

  బీఆర్‌ఎస్‌కు బీజేపీతో లోపాయికారి ఒప్పందం.

Share

  •  టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్.
  •  ‘సర్‌’ ఆందోళనలపై కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారు?
  •  బీజేపీకి భయపడే గులాబీ నేతలు నోరుమెదపడం లేదంటూ విమర్శలు

హైదరాబాద్, మహా.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం మరియు ఆ పార్టీ నేతలు ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో నిలదీశారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎఫ్‌-ఫార్ములా కేసులో లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయంతోనే కేటీఆర్, హరీశ్‌రావు మౌనం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉండటానికి ఇల్లు లేదంటూనే కేటీఆర్‌కు ఫైవ్‌స్టార్ హోటల్స్ ఎలా వచ్చాయని, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

‘సర్‌’ ప్రక్రియ ద్వారా దళితులు, మైనారిటీలు, గిరిజనుల ఓట్లను తొలగిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాల పేరుతో మమతా బెనర్జీని, బిహార్‌లో ఆర్జేడీని గెలవకుండా ఆపే కుట్ర చేశారని మండిపడ్డారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయసుతో నిమిత్తం లేకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతుంటే, కేసీఆర్ కుటుంబం మాత్రం ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం..

నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని హితవుపలికారు. ఎస్‌ఐఆర్‌ అంశంపై దేశంలో మొట్టమొదటగా స్పందించి పోరాటం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ అంటే తమకు గౌరవం ఉందని, ఆయన సామాజిక అంశాలపై స్పందిస్తారని భావిస్తామని.. కానీ ఈ విషయంలో ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదని తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన పేదల ఓట్లను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమని మహేశ్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు.