- అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దృష్టిసారించింది. ఈ ఎన్నికల్లో పార్టీని సమాయత్తం చేసే దిశగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి, సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేకంగా అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ హైకమాండ్ వెల్లడించింది. విజయవాడ మినహా మిగతా అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన కమిటీలను ప్రకటించగా, త్వరలోనే ఈ కమిటీలతో పవన్ కల్యాణ్ స్వయంగా సమావేశంకానున్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతం, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి వ్యూహాలపై ఈ కమిటీలు పనిచేయనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగే ఈ కమిటీల పనితీరును స్వయంగా పవన్ కల్యాణ్ పర్యవేక్షించనున్నారు.
అడ్‌హాక్ కమిటీలతో పాటు స్థానిక ఎన్నికల నిర్వహణను మరింత సులువు చేయడానికి జనసేన మరో నాలుగు కీలక కేంద్ర కమిటీలను కూడా నియమించింది. ఎన్నికల ప్రణాళికలు, విధివిధానాల రూపకల్పన కోసం ప్రత్యేకంగా ఎన్నికల నిర్వహణ, మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేశారు. ఇతర కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు కూటమి సమన్వయ కమిటీని నియమించారు. ఎన్నికల ప్రచార సరళిని, వ్యూహాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందంగా ప్రచార కమిటీని ప్రకటించారు. అలాగే పార్టీ ఆర్థిక వ్యవహారాలు, ఎన్నికల ఖర్చుల నిర్వహణను పర్యవేక్షించేందుకు ట్రెజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు జనసేన హైకమాండ్ స్పష్టం చేసింది.








