Mahaa Daily Exclusive

  ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు.

Share

  •  రద్దీ ప్రాంతాల్లో పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌.
  •  పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలి.
  •  హైదరాబాద్‌–ముంబై బుల్లెట్‌ రైలు మార్గానికి సమాంతరంగా రేడియల్‌ రోడ్డు.
  •  సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు.

హైదరాబాద్‌, మహా.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నగర పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో ప్రజా రవాణా మెరుగుదల, రహదారుల అనుసంధానం, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, పునర్వినియోగ జలాల వినియోగంపై ప్రగతి భవన్‌లో గురువారం ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో రద్దీ నివారణకు పలు నూతన ప్రతిపాదనలపై చర్చించి పలు కీలక సూచనలు చేశారు.

నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అత్యధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో ‘పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌’ (పీఆర్టీ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోని అత్యుత్తమ రవాణా నమూనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ వినూత్న వ్యవస్థను కేవలం ప్రధాన రహదారులకే పరిమితం చేయకుండా మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్‌ స్టేషన్లకు అనుసంధానించాలని, తద్వారా ప్రజలు వ్యక్తిగత వాహనాలను వీడి ప్రజా రవాణా వైపు మొగ్గు చూపేలా తగిన ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.

నగరంలో వివిధ ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముంబై వంటి మహా నగరాల్లో తక్కువ వ్యవధిలో రహదారి నిర్మాణ పనులు పూర్తివుతున్న తీరును ఉదహరించిన ఆయన, అక్కడ అవలంబిస్తున్న ఆధునిక సాంకేతికత, నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభించిన పనులన్నింటినీ రాబోయే ఏడాదిలోపు పూర్తి చేసేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు సాగుతున్న ఫ్లైఓవర్‌ పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వసతుల మార్పిడిని వేగవంతం చేయాలని, కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా వన్‌వే విధానంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హైదరాబాద్‌–ముంబై బుల్లెట్‌ రైలు మార్గానికి సమాంతరంగా ఒక నూతన రేడియల్‌ రోడ్డు నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. శంకర్‌పల్లి–చేవెళ్ల ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఉన్న రోడ్ల విస్తరణతో పాటు కొత్త మార్గాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అంచనా వేయాలన్నారు. నగరానికి వెలుపల వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రాలు, నివాస ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. నగరంలో శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వినియోగించే ప్రాజెక్టులను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోజుకు 500 మిలియన్‌ లీటర్ల పునర్వినియోగ జలాలను పారిశ్రామిక అవసరాలకు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, చందన్‌వల్లి, ఆలూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న డేటా కేంద్రాలు, భారీ పరిశ్రమలు తాగునీటిపై ఆధారపడకుండా ఈ శుద్ధి చేసిన నీటినే వినియోగించుకునేలా ప్రత్యేక మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. భారీ భవన సముదాయాలు, ఉద్యానవనాల్లోనూ ఇదే నీటిని వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూర్‌ చట్టం అమలు దిశగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లు, హైడ్రా, జలమండలి, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు.