కేవీ పాఠశాలలో అలరించిన బతుకమ్మ వేడుక
కారేపల్లి, మహా:తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ ను ఆశ్వయుజ మాసం పాడ్యమికి ముందు వచ్చే మహాలయ అమావాస్య (పెత్తర అమావాస్య) రోజున ప్రారంభమవుతుంది. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను శనివారం సింగరేణి మండలం లో మహిళలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది, సంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు.పూల పండుగ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కారేపల్లిలోని కె.వి ఇంగ్లీషు మీడియా పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిభావంతో నిర్వహించారు. అనంతరం శోభాయాత్రగా తరలివెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈకార్యక్రమంలో విద్యాలయ కరస్పాడెంట్ వాంకుడోత్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








