- అయిదు వేల మందిని అరెస్టు చేసిన పోలీసులు
- పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
- ఆందోళనకారులపై పోలీసుల డేగ కన్ను
- గృహ నిర్భందంలో పలువురు నేతలు
- పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కేతో పాటు పలువురు సీజేపీ నేతలు
- నిరసనలకు ఇక నుంచి అజింక్య శిదే నాయకత్వం వహిస్తారని సీజేపీ నేత ప్రకటన
- పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్న హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ, మహా : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ తల పెట్టిన జంతర మంతర్ వద్ద నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులను మోహరింప చేసిన అధికారులు నిరసన కారులను ఎక్కడి కక్కడే అడ్డుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తుండటంతో ఢిల్లీలోని పలు రహదారులు ట్రాఫిక్ ఆంత్రలలో ఉన్నాయి. నిరసనలో పాల్గొనేందుకు వేర్వేరు ప్రాంతాలలో నుంచి ఢిల్లీకి తరలివస్తున్న వారిని పోలీసులు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లతో పాటు ఎక్కడి కక్కడే తమ అదుపులోకి తీసుకుంటుండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ మొత్తం పోలీసుల అష్టదిగ్భందనంలో ఉంది. ఇప్పటికే తృణముల్ నేత మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్వీల్ తో పాటు పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బందం చేశారు. నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకున్న సీజేపీ అబిజిత్ దీప్కేతో పాటు పలువురిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేసి అజ్ఞాత ప్రాంతంలోకి తరలించారు.
పోలీసుల వ్యాహాన్ని ముందుగానే పసిగట్టామన్న దీప్కే జంతర్ మంతర్ 2.0 నిరసనలకు ఇకపై అజింక్య శిందే నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. తాము పోలీసుల నిర్బంధంలో ఉన్నంత కాలం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, సీజేపీ ఇన్ఛార్జ్ అజింక్య శిందే నాయకత్వంలోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. “నన్ను అరెస్టు చేస్తారని ముందే ఊహించాను. అందుకే శుక్రవారం రాత్రి అజింక్య శిందే ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తాడని స్వయంగా చెబుతూ ఓ వీడియో రికార్డు చేశాను. అందుకే ఈ వీడియో చూస్తున్న వాళ్లు అజింక్య శిందేను అనుసరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని అభిజీత్ దీప్కే ఎక్స్ వేదికగా శనివారం తెలిపారు.
పోలీసుల నిర్బంధంలో దీప్కే
ముంబయి నుంచి దిల్లీలోని జంతర్ మంతర్కు వెళ్తున్న అభిజీత్ దీప్కేను శనివారం విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీరిని విమానాశ్రయం నుంచి నేరుగా ఓ అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. సీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేపీ తలపెట్టిన నిరసనలను అణిచివేసేందుకు మోదీ ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ కన్నా దారుణమైన నిర్బంధం’ పెడుతోందని విమర్శించారు. బొద్దింకలను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని అన్నారు. “ఇది ఎమర్జెన్సీ కన్నా దారుణం. మనం మోదీ సంపూర్ణ నియంతృత్వంలో బతుకుతున్నాం. విమానం దిగిన వెంటనే బొద్దింకలను అరెస్టు చేయడం, ప్రధాని మోదీకి ఉన్న భయాన్ని చూపిస్తుంది. కేవలం ఓటు చోరీ ద్వారా ఎన్నికల్లో గెలిచామని మోదీకి తెలుసు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచివేసి తన మోసాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకున్నారు. ఏదైమైనా సీఈసీ జ్ఞానేశ్ వెళ్లాలి. అలాగే మోదీ కూడా” అని కేజ్రీవాల్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు.
సీజేఐ జోక్యం చేసుకోవాలి
శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో సీజేపీకి మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు నిర్బంధించడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. పోలీసులు మితిమీరిన బలప్రయోగం చేశారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తక్షణమే జోక్యం చేసుకొవాలని కోరింది. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న న్యాయవాదుల ఆచూకీ, భద్రత నిర్ధరించడం కోసం, వారికి న్యాయ సహాయం అందేలా చూడాలని, ఇందుకోసం సంబంధిత అధికారులతో చర్చించాలని ఎస్సీబీఏ గౌరవ కార్యదర్శి ప్రజ్ఞా బఘేల్ సీజేఐను కోరారు. నిర్బంధానికి చట్టబద్దమైన కారణాలు లేని వారిని తక్షణమే విడుదల చేయాలని, ఒకవేళ పోలీసులు బలప్రయోగం చేస్తే, చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలీసులపై రాళ్ల దాడి
మరోవైపు దిల్లీలోని ఆకాశవాణి భవన్ సమీపంలో 25-30 మంది నిరసనకారులు ఇంతియాజ్ అలీ మార్గ్లోని బారికేడ్లపై నుంచి దూకి భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. రాళ్లదాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, తాము కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వాస్తవానికి జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పలువురు నిరసనకారులు వేర్వేరు ప్రదేశాల నుంచి జంతర్ మంతర్కు వచ్చే ప్రయత్నం చేశారు. దీనితో పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకోగా, మరికొందరిని వెనక్కు పంపించారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుత పరిస్థితులన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మొత్తంగా ఢిల్లీలో ఆదివారం ఏం జరుగబోతుంది, ఎవరిది పై చేయి కాబోతుంది అన్న చర్చ అంశంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఈసీ వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉందని, అందుకే ఆయనను కాపాడేందుకు కేంద్రం శక్తియుక్తులను ఒడ్డుతుందంటూ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిరసనలను ఆపేందుకు ఎంత మంది పోలీసులను ఉపయోగించినా తాము వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు. రాబోయే కాలంలో ఆందోళనలను మరింత ఉదృతం చేయడంతో పాటు బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ఇండీ కూటమి అస్త్రశస్త్రాలను సిద్దం చేసిందన్న విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్పారు. మొత్తం మీద ఆదివారం నిరసన కార్యక్రమంలో ఎటు వెళ్ళి ఎక్కడికి దారి తీస్తుందో అన్న దోళనలతో ఢిల్లీ ప్రజలున్నారు.








