సింగరేణి కార్మికులకు శుభవార్త.
* 15 రోజుల్లో కారుణ్య నియామకాలు.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
హైదరాబాద్, మహా:
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, వైద్య సదుపాయాల కల్పన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తున్న 38,738 మంది పర్మనెంట్, 29,715 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియను రాబోయే 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే, కార్మికులను దీర్ఘకాలంగా వేధిస్తున్న మారుపేర్ల సమస్యకు సైతం 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
కార్మికుల వైద్య, ఆరోగ్య సదుపాయాలపైనా డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ పరీక్షల కోసం కార్మికులంతా కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని, ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లోనే ఈ పరీక్షలు నిర్వహించేలా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడు, ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి దీటుగా అభివృద్ధి చేసి, సూపర్ స్పెషాలిటీ వైద్యులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సైతం నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు, కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులకు హాజరు కాలేక డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వారికి వన్ టైమ్ ఆప్షన్ కింద ఈ అవకాశం కల్పిస్తున్నామని భట్టి వెల్లడించారు. కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా, సింగరేణికి చెందిన 1,250 ఎకరాల భూముల్లో జీవో 76 ప్రకారం అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా స్థలాల్లో ఆక్రమణల్లో ఉన్న వారిలో అర్హులను గుర్తించి పట్టాలు అందిస్తామని, కార్మికుల కోసం ప్రత్యేకంగా నెహ్రూ హౌసింగ్ కాలనీ పేరిట నూతన గృహ సముదాయాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్ఎస్‌కు సింగరేణి కార్మికులు గుర్తుకొస్తారని, పదేళ్లు అధికారంలో ఉన్నా మారుపేర్ల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ఆయన నిలదీశారు. కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాల గురించి ఏనాడూ పట్టించుకోని గులాబీ పార్టీ, ఇప్పుడు మళ్లీ కార్మికులను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో 3,389 పోస్టులను భర్తీ చేయడంతో పాటు, 4,237 కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తుచేశారు. అంతేకాకుండా, కార్మికులకు ఏకంగా కోటి రూపాయల బీమా సదుపాయం కల్పించి వారికి కొండంత అండగా నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.








