Mahaa Daily Exclusive

  శ్వేతసౌధంలో కొత్త ప్రెస్‌ సెక్రటరీ తడబాటు….

Share

శ్వేతసౌధంలో కొత్త ప్రెస్‌ సెక్రటరీ తడబాటు.
* ‘భర్త’కు బదులు ‘అధ్యక్షుడు’ అంటూ నోరుజారిన వైనం.
వాషింగ్టన్,మహా.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం నూతన ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా తన తొలి పత్రికా సమావేశంలోనే తడబడ్డారు. ఏకంగా తన భర్తను ఉద్దేశించి ‘నా అధ్యక్షుడు’ అని నోరుజారి ఇబ్బందిపాలయ్యారు. నాలుక్కరుచుకుని వెంటనే తప్పు సరిదిద్దుకున్నప్పటికీ, కేవలం 14 నిమిషాలకే సమావేశాన్ని ముగించి వెళ్లిపోవడం అమెరికన్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం వాషింగ్టన్‌లో జరిగిన తన మొదటి ప్రెస్‌ బ్రీఫింగ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలుపుతూ కేటీ జకారియా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదకొండేళ్లలోపు వయసున్న నలుగురు పిల్లలకు తల్లి అయిన ఆమె, తన వృత్తిగత, కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా కుటుంబ బాధ్యతల్లో భర్త నుంచి తనకు లభిస్తున్న సహకారాన్ని ప్రస్తావించారు. “పిల్లలతో సాయంత్రం సమయం గడపలేకపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నా అధ్యక్షుడు.. క్షమించండి, నా భర్త ఇక్కడే ఉన్నారు” అంటూ తడబడ్డారు. ఆ వెంటనే తేరుకున్న ఆమె, జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు ‘వావ్, ఇది చాలా బాగుంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే, ఈ పత్రికా సమావేశం కేవలం 14 నిమిషాల పాటే సాగడం గమనార్హం. ఫాక్స్ న్యూస్, బ్రీట్‌బార్ట్, డైలీ మెయిల్ వంటి కేవలం మూడు మీడియా సంస్థల ప్రతినిధుల నుంచి మాత్రమే ఆమె ప్రశ్నలు స్వీకరించారు. ఆ తర్వాత ట్రంప్ ‘మెరైన్ వన్’ హెలికాప్టర్‌లో అలాస్కా పర్యటనకు వెళ్తున్నారని, మిగిలిన ప్రశ్నలను అక్కడే అడగవచ్చని చెబుతూ సమావేశాన్ని హడావుడిగా ముగించారు. కానీ, వాస్తవానికి అధ్యక్షుడి పర్యటనకు అప్పటికి ఇంకా చాలా గంటల సమయం ఉండటంతో ఆమె తీరుపై స్థానిక పత్రికలు ఘాటు విమర్శలు చేశాయి. ఆమె ప్రసంగం అత్యంత యాంత్రికంగా అనిపించిందని పలు పత్రికలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఇదే సమావేశంలో కీలక అధికారిణి కింబర్లీ గిల్ఫాయిల్‌ను రాజీనామా చేయాలని కోరినట్లు ఆమె వెల్లడించడం మరో సంచలనంగా మారింది.
కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్‌కు మకాం మార్చిన కేటీ జకారియా నియామకంపై ముందు నుంచే వాషింగ్టన్ వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాను కాలిఫోర్నియాలో న్యాయవాదిగా పనిచేశానని ఆమె గతంలో చెప్పుకున్నారు. కానీ, రాష్ట్ర బార్ వెబ్‌సైట్‌లో ఆమె పేరు ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మీరు బార్ ఎగ్జామ్‌ ఎక్కడ రాశారని ఇటీవల ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. గతంలో బీజింగ్‌లో కొన్నేళ్లపాటు కార్పొరేట్ లాయర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న జకారియా ‘చైనాలో’ అని అత్యంత వెటకారంగా సమాధానం ఇవ్వడం విశేషం. తొలి ప్రెస్‌మీట్‌లోనే ఈ తరహా గందరగోళం సృష్టించిన ఆమె, రాబోయే రోజుల్లో మీడియాను ఎలా ఎదుర్కొంటారోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.