Mahaa Daily Exclusive

  సర్ పై సుప్రీం మెట్లెక్కిన ఒవైసీ…

Share

  • సర్ పై సుప్రీం మెట్లెక్కిన ఒవైసీ
  • ఓటర్ల జాబితా సవరణపై అభ్యంతరం
  • ప్రక్రియపై స్టే విధించాలని పిటిషన్‌

హైదరాబాద్, మహా : ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సవాల్‌ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన విధానాలను పాటించకుండా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని తన పిటిషన్‌లో ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సవరణ ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని కోరారు. ఒవైసీ తరఫున న్యాయవాది నిజాముద్దీన్‌ పాషా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ అంశంపై ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి తమ పిటిషన్‌ను కూడా గురువారం విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ.. అభ్యర్థనను పరిశీలించి, సంబంధిత కేసులతో కలిపి విచారణ జాబితాలో చేర్చే అంశాన్ని చూస్తామని తెలిపారు.

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఫారం-6 దరఖాస్తులకు సంబంధించి మ్యాపింగ్‌ వంటి నిబంధనలు ఓటర్లకు ఇబ్బందికరంగా మారుతున్నాయని ఒవైసీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో తగిన విధానాలను పాటించడం లేదని ఆరోపిస్తూ, సవరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఒవైసీ పిటిషన్‌ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధిత పిటిషన్లను కలిపి విచారించే అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.