3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతాం!
* యువత, మహిళలే పారిశ్రామిక ప్రగతికి చోదకశక్తులు.
* ప్రపంచ నగరాలతో పోటీపడేలా హైదరాబాద్.
* స్టార్టప్‌లకు స్వర్ణావకాశాలు.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, మహా.
తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో యువత, మహిళలకు పారిశ్రామిక రంగంలో విస్తృత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యనున్న ప్రాంతాన్ని తయారీ పరిశ్రమలు, స్టార్టప్‌ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని కొత్త పరిశ్రమలు స్థాపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్–2026 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య పారిశ్రామిక ప్రగతి.
హైదరాబాద్ అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మెరుగైన రవాణా సదుపాయాలతో ఐటీ, ఔషధ, విద్య, సేవల రంగాలు విస్తరించి నగరం అంతర్జాతీయ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా ఎదిగిందన్నారు. ఇదే తరహాలో ఓఆర్ఆర్కు వెలుపల సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో 360 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య సుమారు 10,500 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించి తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు యువ పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.
మూడు ప్రాంతాలు.. మూడు అభివృద్ధి ప్రణాళికలు.
తెలంగాణ రైజింగ్–2047లో భాగంగా రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ ఆర్థిక విభాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించామని, ఇక్కడ సుమారు 1.34 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకున్నామని చెప్పారు. కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించి, హైదరాబాద్‌లో సేవల రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం పరిశ్రమల తరలింపునకు అవసరమైన రాయితీలు, అనుమతులు, సహకారం అందించేందుకు హిల్ట్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు.
అలాగే రీజినల్ రింగ్ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని గ్రామీణ వ్యవసాయ ఆర్థిక విభాగంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, జనాభా, వనరులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.
భారత్ స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్పష్టమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025లో తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, ప్రణాళికల అమలు కీలకమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్టార్టప్‌ల స్థాపనపై యువత దృష్టి పెట్టాలి.
ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో భారతీయులు ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా సొంతంగా స్టార్టప్‌లు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులు, నూతన విధానాలు, చట్టాలపై యువతకు అవగాహన కల్పించడంలో చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించే సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త తరాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తోందని అభినందించారు.
మహిళలకు పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యం.
మహిళల భాగస్వామ్యం పెరిగిన దేశాలు ఆర్థికంగా పురోగమిస్తున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. భారతదేశంలోనూ మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, యువతకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా పారిశ్రామిక రంగంలో తెలంగాణ మరింత పురోగతి సాధించగలదని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో ప్రముఖులు సాధించిన విజయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం ద్వారా యువతలో స్ఫూర్తి నింపవచ్చని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యం.
హైదరాబాద్‌ను ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు అవకాశాలు పెంచడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.








