- పెట్టుబడులకు తెలంగాణ ఓ భరోసా
- పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉఁడాలన్నది మా లక్ష్యం
- హైటెక్స్‌లో జరిగిన సదస్సులో ప్రసంగించిన సీఎం
హైదరాబాద్, మహా : పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ఓ భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ పాలసీతో అనుకూలమైన విధానాలను అనుసరిస్తున్నామని తెలిపారు. హైటెక్స్‌లో జరిగిన సమాఖ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జనాభా శాతాన్ని మించి తెలంగాణ రాష్ట్రం జీడీపీకి తన వాటా అందిస్తోందిన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదని మంచి పాలసీతో ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడ్డా అందులో మహిళల భాగస్వామ్యం ఉన్న దేశమే అత్యధికంగా ఆర్థికంగా ఎదిగిన దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
పెట్టుబడులు పెట్టే యువ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పలుకుతుందన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, రాయితీలు, ప్రోత్సాహకాలతో సమగ్ర విధానం రూపొందించిందన్నారు. తెలంగాణను మూడు ఎకనామిక్ జోన్లుగా అర్బన్, పెరి-అర్బన్, రూరల్ విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. సర్వీస్, తయారీ, వ్యవసాయ రంగాలకు సమప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ జనాభాలో రాష్ట్ర వాటా 2.5 శాతమే అయినా జీడీపీలో 5 శాతం తెలంగాణ నుంచే అందిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెట్టుబడులు, కచ్చితమైన ప్రణాళికలు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతోనే ఈ లక్ష్యాల సాధన సాధ్యమని సీఎం పేర్కొన్నారు. వ్యక్తులుగా కంటే అందరూ ఒక కమ్యూనిటీగా ఏకమైతేనే యువతకు మరింత బలమని అభిప్రాయపడ్డారు.
ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
మహిళల భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే కాకుండా ఆ సంస్థకు 1,000 బస్సులను అద్దెకు ఇచ్చే యజమానులుగా మహిళా సంఘాలు ఎదిగాయన్నారు. కార్పొరేట్ దిగ్గజాలకు ధీటుగా మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి, జెన్కోకు సరఫరా చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాలోనూ మహిళా సంఘాలకు భూములు కేటాయించి, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు.
ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం
శిల్పారామం వద్ద 3.5 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ల ఏర్పాటు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌కు వేదిక అని రేవంత్ రెడ్డి తెలిపారు. యువతతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను కూడా సమాఖ్య ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వపరంగా పూర్తి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదన్నారు. గత 30 ఏళ్లుగా ఉన్న మంచి విధానాలను తమ ప్రభుత్వం మార్చలేదని గుర్తుచేశారు. ‘తెలంగాణలో మీ పెట్టుబడులకు పూర్తి భద్రత, లాభం, సత్వర అనుమతులు ఉంటాయి రండి మాతో కలిసి ఎదగండి’ అని పారిశ్రామిక వేత్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.








