Mahaa Daily Exclusive

  హైవే హోటళ్లలో అపరిశుభ్రత తాండవం!

Share

హైవే హోటళ్లలో అపరిశుభ్రత తాండవం!
* ఏడు హోటళ్ల లైసెన్సులు సస్పెండ్‌.
* మరో హోటల్‌ మూసివేతకు ఆదేశాలు.
* వంటగదుల్లో బొద్దింకలు.. కుళ్లిన కూరగాయలు.
* హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై అధికారుల కొరడా.
* 20 రెస్టారెంట్లలో తనిఖీలు.. 20 ఆహార నమూనాల సేకరణ.

హైదరాబాద్, మహా.

హైవేపై భోజనం కోసం హోటళ్లలో ఆగుతున్నారా? అయితే అక్కడి ఆహార భద్రతా ప్రమాణాలపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై హోటళ్లలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో బొద్దింకలు, ఈగలు, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్ర రిఫ్రిజిరేటర్లు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. సూర్యాపేటలోని ఓ హోటల్‌లో ముడి మాంసంతోపాటు తినదగిన మంచు ముక్కలను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 20 రెస్టారెంట్లను తనిఖీ చేసిన అధికారులు ఏడు హోటళ్ల లైసెన్సులను సస్పెండ్‌ చేశారు. మరో హోటల్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

పది బృందాలతో మెరుపు తనిఖీలు

టీజీ సేఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి చెందిన పది బృందాలు ఆహార భద్రతాధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించాయి. వంటగదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, సిబ్బంది వ్యక్తిగత శుభ్రత, తప్పనిసరి రికార్డులను పరిశీలించాయి. కొన్ని హోటళ్లలో దెబ్బతిన్న నేలలు, నిల్వ ఉన్న మురుగునీరు, గ్రీజు పేరుకుపోయిన ఎగ్జాస్ట్‌ పరికరాలు, శుభ్రం చేయని వంట సామగ్రి గుర్తించారు. శాఖాహార, మాంసాహార పదార్థాలను కలిపి నిల్వ ఉంచినట్లు కూడా వెల్లడైంది.

ఏడు హోటళ్లపై లైసెన్సుల సస్పెన్షన్‌

నల్గొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద ఉన్న 7 మిడ్‌వే ప్లాజా, నార్కట్‌పల్లిలోని అమ్మచేతి వంట (అంజనా టిఫిన్స్‌), సూర్యాపేటలోని తనూజా హోటల్స్‌, హైవే హాస్పిటాలిటీ, శ్రీ మమత లాడ్జ్‌ అండ్‌ రెస్టారెంట్‌, యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్‌లోని శ్రీ ఆద్య గ్రాండ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌, చౌటుప్పల్‌ యెల్లగిరి ఎక్స్‌ రోడ్డులోని సంగం హోటల్‌పై చర్యలు తీసుకున్నారు. ఆయా హోటళ్ల ఆహార భద్రతా లైసెన్సులను సస్పెండ్‌ చేసి, వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

లైసెన్స్‌ లేకుండానే మరో హోటల్‌ నిర్వహణ

నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని హోటల్‌ సాయిప్రియ ఫ్యామిలీ రెస్టారెంట్‌ సరైన లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వంటగదిలో నిల్వ ఉన్న నీరు, కుళ్లిన కూరగాయలు, దుర్వాసన, అపరిశుభ్ర రిఫ్రిజిరేటర్లు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో రెస్టారెంట్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

మరో 13 సంస్థలకు నోటీసులు

తనిఖీల్లో గుర్తించిన లోపాలపై ఎనిమిది సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేయనున్నారు. మరో ఐదు సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘనలపై వివరణ తీసుకుని, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు. లోపాలను సరిచేశాయా లేదా అన్నది పరిశీలించేందుకు తిరిగి తనిఖీలు నిర్వహించనున్నారు.

20 ఆహార నమూనాల సేకరణ

అనుమానిత ఆహార కల్తీని నిర్ధారించేందుకు అధికారులు 20 నమూనాలను సేకరించారు. ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా ఆహార నాణ్యతపై స్పష్టత రానుంది. ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే ఉల్లంఘనలపై తనిఖీలు కొనసాగించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్‌ కమిషనర్‌ తెలిపారు.