Mahaa Daily Exclusive

  ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ధ్వంసం చేస్తారా?

Share

  •  నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి.
  •  నష్టాన్ని బాధ్యుల నుంచే వసూలు చేయాలి.
  •  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు.

అమరావతి, మహా:

ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ట్రాక్టర్‌తో ధ్వంసం చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రూ. 4.75 కోట్లతో నిర్మించిన రహదారి ధ్వంసం

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. 4.75 కోట్ల వ్యయంతో రహదారిని నిర్మించారు. వారం రోజుల క్రితమే నిర్మించిన ఈ రహదారిలో దాదాపు 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్ని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వైసీపీ నేత సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.

నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం

ఈ ఘటనపై సోమవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులతో పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు.

నష్టాన్ని బాధ్యుల నుంచే వసూలు చేయాలి

ప్రజల సౌకర్యార్థం నిర్మించిన మౌలిక వసతులను ధ్వంసం చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. రహదారిని ధ్వంసం చేసిన ప్రత్యక్ష బాధ్యులతో పాటు, వారి వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ప్రజాధనానికి నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు

ధ్వంసమైన రహదారి మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని బాధ్యుల నుంచే వసూలు చేసేలా రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.