Mahaa Daily Exclusive

  ఆధునిక అధర్మస్య ఉపరి ధర్మస్య అజేయ విజయః

Share

  •  కాలగర్భంలో నిక్షిప్తమైన ధర్మ విజయ శాసనం ‘విజయదశమి’.
  • శమీ శమయతే పాపం శమీ శత్రువినాశనీ ।
  • అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ॥

శమీ (జమ్మి) వృక్షం పాపాలను పోగొడుతుంది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది అజ్ఞాతవాస సమయంలో అర్జునుని ఆయుధాలను భద్రపరిచిన చెట్టు , లంకా దండయాత్రకు ముందు శ్రీరాముడికి విజయానికి సూచికగా దర్శనమిచ్చిన చెట్టు. (అందుకే జమ్మి చెట్టును దర్శించడం, పూజించడం సకల శుభాలను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం).

శరత్కాలపు స్వచ్ఛతను పుణికిపుచ్చుకున్న ఆశ్వయుజ దశమి, కేవలం క్యాలెండర్‌లోని ఒక సాధారణ పర్వదినం కాదు. అది యుగయుగాలుగా భారతీయ సామాజిక ఆత్మలో ప్రవహిస్తున్న నైతిక చైతన్యానికి సజీవ దర్పణం. పౌరాణిక ఆఖ్యానాలకు, గతకాలపు కథనాలకు అతీతంగా, శుద్ధ సామాజిక శాస్త్ర నికోషంపై విజయదశమి అనేది పతనమవుతున్న మానవీయ విలువల మధ్య సమాజం నిలబెట్టుకుంటున్న ఒక ఉజ్వలమైన దార్శనిక తీర్మానం. అధర్మం, అహంకారం, అవినీతి లాంటి వర్తమాన సామాజిక జాడ్యాలపై సత్యం ఎప్పటికైనా పైచేయి సాధిస్తుందన్న నిఖార్సైన వాస్తవం.

వ్యవస్థాగత అరాచకాలు, స్వార్థపూరిత ధోరణులు ఆధునిక అసుర శక్తులుగా రూపాంతరం చెంది సామాన్యుడిని పీడిస్తున్న తరుణంలో, ఈ పర్వదినం ఒక అద్భుతమైన సామాజిక సంస్కరణాస్త్రంగా మన కళ్ల ముందు నిలుస్తోంది. ప్రతి ఏడాదీ జరిగే రాక్షస దహన క్రియల వెనుక ఉన్న నిగూఢ పరమార్థం బాహ్య శత్రువుల భౌతిక సంహారం కాదు; మనిషి అంతరంగంలో గూడుకట్టుకున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలతో పాటు అహంకారాన్ని సమూలంగా దహించివేయడం. వ్యవస్థలోని చీకటి కోణాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ, నైతికతను పునరుద్ధరించాలంటూ సామాజిక మనస్సాక్షి చేస్తున్న ఒక కఠోరమైన తపస్సు ఇది. చట్టం, న్యాయం నిర్వీర్యమైనట్లు కనిపించిన ప్రతిసారీ, ఒక అంతర్గత నైతిక శక్తి ఉప్పెనలా లేచి సామాజిక సమతౌల్యాన్ని సాధిస్తుందన్న తీవ్రమైన హెచ్చరిక ఇందులో అంతర్లీనంగా ప్రతిధ్వనిస్తోంది.

ఈ పర్వదిన వాతావరణంలో ప్రస్ఫుటంగా కనిపించే ఆయుధ పూజా ఘట్టం.. శ్రమ జీవన సౌందర్యానికి, వృత్తి నైపుణ్యానికి సమాజం అందించే అత్యున్నత గౌరవానికి ప్రతీక. ఇది కేవలం భౌతిక పరికరాల ఆరాధన కాదు; ఆధునిక సాంకేతిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కర్షకుడి నాగలి కర్రు నుండి అంతరిక్ష శాస్త్రవేత్త ప్రయోగించే రాకెట్ వరకు, సామాన్యుడి సమ్మెట నుండి వ్యవస్థలను మేల్కొల్పే పాత్రికేయుడి కలం వరకు… సకల వృత్తి నైపుణ్యాలకు దక్కిన అరుదైన ‘సంపాదకీయ గుర్తింపు’. నిరుద్యోగం, దారిద్ర్యం లాంటి సామాజిక, ఆర్థిక సవాళ్లను స్వశక్తితో ఎదుర్కోవాలన్న నిశ్శబ్ద విప్లవానికి ఇది నాంది. శ్రమదోపిడీ రహిత వ్యవస్థకు, కర్మ సిద్ధాంతానికి మారుపేరుగా నిలుస్తూ, వృత్తి పట్ల అంకితభావమే వాస్తవిక ధర్మసంస్థాపన అని నవీన తరానికి నిర్దేశిస్తోంది.

ఇక విపరీతమైన యాంత్రికీకరణతో, డిజిటల్ తెరల వెనుక బందీలై ఏకాకిగా మారుతున్న ఆధునిక మానవుడిని వాస్తవిక ప్రపంచంలోకి నడిపించే ఒక మహాత్తరమైన సోషియో-సైకలాజికల్ వారధి ఈ పండుగ. వర్గ, వర్ణ, ఆర్థిక, హోదా తారతమ్యాలను విస్మరించి, తరాల అంతరాలను పటాపంచలు చేస్తూ, ప్రకృతి ప్రసాదించిన పత్రాలను ఆత్మీయతకు ప్రతీకలుగా పంచుకునే సంప్రదాయం ‘వసుధైక కుటుంబ’ భావనకు ప్రబల నిదర్శనం. కాంక్రీట్ అడవుల్లో విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలకు పునరుజ్జీవం పోస్తూ, అపార్ట్‌మెంట్ల సంస్కృతిలో ముడుచుకుపోయిన మనిషిని పక్క మనిషితో కలిపే ఒక సాంస్కృతిక సంధానకర్తగా దసరా ఉత్సవం సామాజిక ప్రాముఖ్యతను సంతరించుకుంది.

విజయదశమి అంటే గడిచిపోయిన కాలపు విజయాల నెమరువేత ఎంతమాత్రమూ కాదు. భవిష్యత్ సామాజిక నిర్మాణానికి అవసరమైన ఆత్మవిశ్వాసానికి, నిరంతర ఆత్మపరిశీలనకు అది ఒక మేలుకొలుపు. నిరాశానిస్పృహల అంధకారాన్ని చీల్చుకుంటూ, అలుపెరగని సత్యాన్వేషణ, చెక్కుచెదరని నిబద్ధతలతో ధర్మపథంలో సాగించే ప్రతి అడుగూ అంతిమంగా విజయపథమే అవుతుందని కాలానుగుణంగా ఈ పర్వదినం ఘంటాపథంగా చెబుతోంది. సంకుచిత స్వభావాలను వీడి, విశాల దృక్పథంతో సమసమాజ నిర్మాణానికి నిరంతరం కార్యోన్ముఖులు కావడమే మనం ఈ పర్వదినానికి అర్పించే అసలైన అక్షర నీరాజనం.

గడల నరసింహారావు.

అసోసియేట్ ఎడిటర్, మహాపత్రిక.