- 34 నెలల్లో 12.40 లక్షల పాస్బుక్కుల జారీ.
- 15 గ్రామాల్లో 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలపై పట్టాలు.
- రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంపై మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్, మహా:
రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించడం, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం అమలు, పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ, భూముల పునఃసర్వే, పెండింగ్ భూ వివాదాల పరిష్కారంపై సమీక్షించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు.
34 నెలల్లో 12,40,366 పాస్‌బుక్కులు
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 34 నెలల్లో మొత్తం 12,40,366 పట్టాదారు పాస్‌బుక్కులను రైతులకు అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 5,68,858 పాస్‌బుక్కులు జారీ చేసినట్లు తెలిపారు. అంతకుముందు 6,71,508 పాస్‌బుక్కులు అందించినట్లు వివరించారు.
భూభారతితో చట్టబద్ధమైన హక్కులు
భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా భూములను సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో హక్కులు నమోదు కాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్న రైతులను గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. వాస్తవ సాగుదారులను గుర్తించి, చట్టప్రకారం వారికి భూ హక్కులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
నారాయణపురంలో 906 మంది రైతులకు హక్కులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ గ్రామంలో పునఃసర్వే నిర్వహించి గిరిజన, గిరిజనేతర రైతుల భూ సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా భూమిపై హక్కులు కల్పించినట్లు వెల్లడించారు.
15 గ్రామాల్లో 2,400 మంది రైతులకు పట్టాలు
సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల పరిధిలో 15 గ్రామాల్లో పునఃసర్వే ద్వారా 2,400 మంది రైతులకు 3,450 ఎకరాల భూమిపై పట్టాలు అందించినట్లు మంత్రి వివరించారు. పట్టాదారు పాస్బుక్కుల ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పునఃసర్వే
ములుగు జిల్లా ముల్కాపల్లి మండలంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలాల్లో పునఃసర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి, అర్హులైన హక్కుదారులకు త్వరలో పట్టాదారు పాస్‌బుక్కులు అందిస్తామని చెప్పారు.
క్షేత్రస్థాయిలో ఉత్తర్వుల అమలుకు ఆదేశాలు
ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, జారీ చేస్తున్న ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలైనప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే విధానంలో సర్వే నిర్వహించి, భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలో ఫుడ్ పార్కు ఏర్పాటుపై ఆ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.








