- రూ.18 లక్షలు దోచేసిన ఘనుడు
- బాధితుల్లో ఓ పోలీస్ అధికారి
- నిందితుడి నుంచి రూ. 20 లక్షలు స్వాధీనం
హైదరాబాద్, మహా : సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి.. హనీట్రాప్ ఉచ్చులోకి లాగి పలువురిని మోసం చేసి లక్షలు దోచేసిన ఓ యువకుడి బాగోతాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. నిందితుడి వలపు వలలో పలు రాష్ట్రాల యువకులు, విదేశీయులు కూడా ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన 23 ఏళ్ల కొండబత్తుల పవన్ కుమార్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి యువకులను టార్గెట్ చేస్తున్నాడు. వారితో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో దగ్గరై ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సేకరించడం, అనంతరం వాటిని బయటపెడతానని బెదిరించి, లక్షల్లో వసూలు చేయడం.
యువకుడి నుంచి రూ.18 లక్షలు వసూలు
ఈ క్రమంలో హనీట్రాప్ ఉచ్చులో పడిన ఓ యువకుడి నుంచి రూ.18 లక్షలు వసూలు చేసిన పవన్ కుమార్ మరో రూ. 7.16 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకుంటే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు పవన్ గుట్టురట్టయ్యింది. అతడి వద్ద పదుల సంఖ్యలో వ్యక్తుల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఫేక్ ఐడీలో అకౌంట్లు
మొత్తం 13 ఫేక్ ఇన్‌స్టా,14 ఫేస్బుక్, రెండు వాట్సాప్ ఐడీలు, మూడు బ్యాంకు ఖాతాల వివరాలను గుర్తించారు. అనంతరం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకుని.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టిన చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే కేసు వివరాలను వెల్లడించారు. మహిళ పేరుతో పోలీసు అధికారిని కూడా ట్రాప్ చేసినట్లు ఆయన చెప్పారు. ‘‘పాతబస్తీకి చెందిన నిందితుడు పవన్ కుమార్‌ను సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిగా పరిచయం చేసుకున్న పవన్.. పోలీసు ఆఫీసర్‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేసి మరింత చేరువై.. తర్వాత డబ్బులు డిమాండ్ చేసినట్లు మాకు సమాచారం అందింది.. దీనిపై దర్యాప్తు చేపట్టి పక్కాగా ప్లాన్ చేసిన నిందితుడ్ని పట్టుకున్నాం.. అతడి జాబితాలో వందల మంది బాధితులు ఉన్నారు.. వేలాది వాట్సాప్ చాటింగ్‌లు బయటపడ్డాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు చెందిన యువకులు ఇందులో చిక్కుకున్నారు. దుబాయ్, టర్కీ, పాకిస్థాన్ వంటి విదేశాలకు చెందిన పలువుర్ని పవన్ మోసం చేసినట్లు మాకు సమాచారం ఉంది’’ అని డీసీపీ కిరణ్ ఖేర్ వెల్లడించారు. బాధితుల్లో డాక్టర్లు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు పవన్ నుంచి రూ.20 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.








