Mahaa Daily Exclusive

  వెలుగుమట్ల కాలనీ నవంబర్‌ 15 నాటికి పూర్తి చేయాలి.

Share

• డిసెంబర్‌ 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.

• రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఖమ్మం, మహా:

ఖమ్మంలోని వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు అన్ని మౌలిక సదుపాయాల పనులను నవంబర్‌ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ నెలాఖరులోగా అన్ని ఇళ్ల స్లాబుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, నవంబర్‌ 8 నాటికి ఇళ్లపై సౌర విద్యుత్‌ పలకల ఏర్పాటును పూర్తిచేయాలని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 9న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సోమవారం వెలుగుమట్ల కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిర్మాణం ప్రారంభించిన 300 ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి నిర్మాణ స్థితి, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పూర్తిచేయాల్సిన పనుల వివరాలతో నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. ప్రతిరోజూ పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి మూడు రోజులకు ఒకసారి పురోగతి నివేదిక అందించాలని స్పష్టం చేశారు. కాలనీలోని ఇళ్లన్నింటినీ ఒకే నమూనాలో, ఆకర్షణీయంగా నిర్మించాలని, ఒకే రంగులో తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పగలు, రాత్రి పనులు కొనసాగించాలని ఆదేశించారు. అక్టోబర్‌ నెలాఖరులోగా అన్ని ఇళ్ల స్లాబుల నిర్మాణంతో పాటు విద్యుత్‌ పనులను కూడా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

ఇళ్ల నిర్మాణంతోపాటు రహదారులు, డ్రైనేజీలు, ఎనిమిది దుకాణాలతో కూడిన షాపింగ్‌ సముదాయం, బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్‌, అంగన్‌వాడీ కేంద్రం తదితర సదుపాయాల పనులను కూడా నవంబర్‌ 15 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని పనులను సమాంతరంగా చేపట్టి ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటికీ తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు చేసి, ఇంటి వద్దే కుళాయి ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిసెంబర్‌ 9న ప్రారంభోత్సవం

డిసెంబర్‌ 9న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా వెలుగుమట్ల కాలనీ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అప్పటికి ఇళ్లు, రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా కాలనీ పేరును ముఖ్యమంత్రి ప్రకటిస్తారని తెలిపారు.

వెలుగుమట్లలో గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, పేదల పేరుతో కొందరు భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారని మంత్రి పేర్కొన్నారు. కోర్టు నిర్ణయం మేరకు జిల్లా యంత్రాంగం ఆక్రమణలను తొలగించిందని తెలిపారు. అదే ప్రాంతంలో మోసపోయిన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖాదర్‌ బాబా, ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హన్మంతరావు, ప్రజాప్రతినిధులు రాయల నాగేశ్వరరావు, దీపక్‌ చౌదరి, కమర్తపు మురళి, కిషోర్‌, సాధు తదితరులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.