Mahaa Daily Exclusive

  49 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అనుమతి.

Share

• రాష్ట్రవ్యాప్తంగా ఏడు విశ్వవిద్యాలయాల్లో 429 పోస్టులు.

హైదరాబాద్, మహా:

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఏడు విశ్వవిద్యాలయాల్లో మొత్తం 429 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో 49 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.

ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్లు 141, 142లను విడుదల చేసింది.ఉమ్మడి మార్గదర్శకాలు, రోస్టర్‌ విధానానికి అనుగుణంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. అయితే దరఖాస్తుల ప్రారంభ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్లలో వెల్లడికానున్నాయి.

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని హుస్నాబాద్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, సమాచార సాంకేతికత, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవే కాకుండా ఇంగ్లిష్‌, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, శారీరక విద్య, గ్రంథాలయ విభాగాల్లోనూ నియామకాలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లా, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరతను తగ్గించేందుకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి. పోస్టుల భర్తీతో బోధన, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం కలుగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించి, అందులో పేర్కొన్న అర్హతలు, దరఖాస్తు తేదీలు, ఎంపిక నిబంధనల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.