Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్‌రెడ్డితో మధుయాష్కీ గౌడ్‌ భేటీ.

Share

• ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ.

• ఏఐపీసీ బలోపేతానికి సహకరిస్తానన్న ముఖ్యమంత్రి.

హైదరాబాద్‌, మహా:

ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ జాతీయ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఏఐపీసీని తెలంగాణలో మరింత బలోపేతం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చ

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌, సబ్సిడీపై వంటగ్యాస్‌ సిలిండర్లు, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్‌ వంటి పథకాల అమలు తీరును ప్రజలకు వివరించే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

ప్రతి నియోజకవర్గంలో సమీకృత పాఠశాలల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం ద్వారా కొత్త పరిశ్రమలు, సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా చర్చించినట్లు తెలిసింది.

ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షలు

సంక్షేమ పథకాల అమలును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, వాటి పురోగతిపై నివేదికలు తీసుకోవాల్సిన అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇతర సంస్థలు, కార్యక్రమాల పనితీరును సమీక్షిస్తున్న తరహాలోనే ప్రభుత్వ శాఖలు, పథకాల అమలుపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఇరువురు అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఏఐపీసీ బలోపేతానికి సీఎం సహకారం

తెలంగాణలో ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, వివిధ రంగాలకు చెందిన నిపుణులను సంస్థలో భాగస్వాములను చేయడంపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై నిపుణుల అభిప్రాయాలు సేకరించి సమగ్ర నివేదికలు రూపొందించే వేదికగా ఏఐపీసీని తీర్చిదిద్దే అంశాన్ని ప్రస్తావించారు.

వివిధ రంగాల్లో అనుభవం ఉన్న నిపుణుల సేవలను ప్రభుత్వం, పార్టీ వినియోగించుకోవడం ద్వారా కొత్త విధానాల రూపకల్పనకు తోడ్పాటు లభిస్తుందని చర్చించినట్లు సమాచారం. ఏఐపీసీ బలోపేతానికి సహకరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులపై వడ్డీ భారం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వానికి ఎదురవుతున్న ఆర్థిక పరిమితుల మధ్య సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.