Mahaa Daily Exclusive

  విజయవాడ ఉత్సవ్‌కు ఘనంగా ముగింపు.

Share

• 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్‌.

• కార్నివాల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు.

• అమ్మవారి అలంకారాలు, ప్రత్యేక రథంతో భారీ ప్రదర్శన

విజయవాడ, మహా:

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయవాడలో మంగళవారం భారీ కార్నివాల్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా ఉత్సవాలతో పాటు కృష్ణానది తీరాన నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌ మంగళవారంతో ముగియనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా సుమారు 2 వేల మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సోమవారం విజయవాడలో మాట్లాడిన పట్టాభిరామ్‌.. గత ఏడాది కంటే భిన్నంగా, మరింత ఆకర్షణీయంగా ఈసారి కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దసరా సందర్భంగా వివిధ వేషధారణలు, సంప్రదాయ కళారూపాలతో ప్రదర్శనలు ఇచ్చే కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు పాల్గొంటారని వివరించారు.

ఏలూరు రోడ్డులోని ఎస్ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద మంగళవారం కార్నివాల్‌ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్‌ తెలిపారు. అమ్మవారి అలంకారాలు, ప్రత్యేకంగా రూపొందించిన రథం, 40 కళాబృందాలతో ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. ఎస్ఆర్‌ఆర్‌ కళాశాల నుంచి విశాలాంధ్ర మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు కార్నివాల్‌ సాగుతుందని వెల్లడించారు.

 

బీఎస్ఎన్ఎల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర అతిథులు పాల్గొంటారని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పట్టాభిరామ్‌ చెప్పారు. అమ్మవారి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రదర్శనలను తిలకించాలని కోరారు. పొరుగు జిల్లాల ప్రజలు కూడా విజయవాడకు వచ్చి కార్నివాల్‌ను వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, కృష్ణానది తీరంలోని విజయవాడ ఉత్సవ్‌ నగరంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం నిర్వహించే కార్నివాల్‌తో ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు.