- కేంద్ర ప్రభుత్వ ‘ఖేత్ బచావో అభియాన్’ ప్రారంభం.
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మహా.
సమాజానికి జీవనాధారమైన నేల తల్లిని సంరక్షించుకుంటేనే భావితరాలకు పక్కాగా ఆహార భద్రత కల్పించగలమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు సాధించడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. నేల సారాన్ని పరిరక్షించడం, పంట భూములను సంరక్షించడం, ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల.. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూముల పరిరక్షణ, భూసార పరీక్షలు, నీటి పొదుపు, సేంద్రీయ సాగు వంటి పలు కీలక అంశాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. ఋతుపవనాల తగ్గుదల, భూతాపం పెరగడం, వర్షపాతంలో అసమానతలు, సకాలంలో వానలు కురవకపోవడం వంటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కోరారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూమి స్వభావం, స్థానిక వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ప్రతి రైతు విధిగా తన వ్యవసాయ భూమికి భూసార పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. నేలలోని పోషకాల స్థాయిని తెలుసుకున్న తర్వాతే, ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు అవసరమో నిర్ధారించుకోవాలని సూచించారు. దీనివల్ల అనవసరమైన ఎరువుల ఖర్చును తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, ఆహార నాణ్యతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో రికార్డులు నిర్వహించి, భూసార ఫలితాల ఆధారంగా రైతులను సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని ఆదేశించారు.
భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో రైతులు నీటి వినియోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అందుబాటులోని నీటిని పొదుపుగా వాడుతూ, డ్రిప్ ఇరిగేషన్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా పాటించాలని తెలిపారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక పంటలు, అపరాలను సాగు చేసేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలన్నారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని, సహజ నీటి వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు.
పంట కోతల అనంతరం మిగిలే వ్యర్థాలను కాల్చివేయడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతుందని మంత్రి తుమ్మల హెచ్చరించారు. ఈ వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్కు వినియోగించి నేలలో తేమ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా వ్యవసాయంతో పాటు పశుపోషణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పంట అవశేషాలను పశుగ్రాసంగా ఉపయోగించుకునే అవకాశాలను రైతులు పరిశీలించాలని పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.








