Mahaa Daily Exclusive

  ముదిరాజ్‌లకు రేవంత్‌రెడ్డి తీపి కబురు.

Share

  •  బీసీ-ఏ గ్రూపులోకి మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం!
  • ట్యాంక్‌బండ్ వద్ద పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాల ఏర్పాటుకు సీఎం రేవంత్ ప్రకటన.
  •  కులగణన లెక్కలతోనే బలహీనవర్గాలకు ధైర్యం, అడిగే హక్కు వచ్చిందన్న ముఖ్యమంత్రి.
  •  రవీంద్రభారతిలో ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు.

హైదరాబాద్, మహా.

తెలంగాణలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి త్వరలోనే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన మహా యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ప్రత్యేక పాటలను ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

న్యాయపరమైన చిక్కులు లేకుండా పక్కా ప్రణాళిక.

గతంలో ముదిరాజ్‌లను బీసీ గ్రూపు మార్చాలని ప్రతిపాదించినప్పటికీ, సరైన లెక్కలు లేవన్న కారణంతో న్యాయస్థానాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కులగణన ద్వారా బీసీల లెక్కలు పక్కాగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా, నిపుణులు మరియు అధికారులతో సంప్రదించి మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముదిరాజ్‌లకు పూర్తి న్యాయం జరిగేలా సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో చేర్చడం వల్ల గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందనే అపోహలు కొందరిలో ఉన్నాయని, ఆ వర్గాలతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

కులగణన లెక్కలే బహుజనులకు ఆయుధం.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందని రేవంత్ రెడ్డి కొనియాడారు. 2024 ఫిబ్రవరి 4న కమిషన్‌ను ఏర్పాటు చేసి, సరిగ్గా ఏడాది కాలంలోపే 2025 ఫిబ్రవరి నాటికి కులగణన లెక్కలను పూర్తి చేసి దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపామని చెప్పారు. ప్రతి ఇంటి తలుపుతట్టి సేకరించిన ఈ పక్కా లెక్కలే బలహీనవర్గాలకు అసలైన ధైర్యాన్ని, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే హక్కును కల్పించాయని స్పష్టం చేశారు. లెక్కల్లో ఒకటి అరా తేడాలున్నా లేదా ఎవరి పేరైనా నమోదు కాకపోయినా వాటిని సవరించుకునేందుకు ప్రభుత్వం ‘ఓపెన్ మైండ్’తో ఉందని, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.

చరిత్ర పుటల్లో పండుగ సాయన్నకు సముచిత స్థానం.

నిరుపేదలు, బహుజనుల అభ్యున్నతి కోసం, జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప పోరాటయోధుడు పండుగ సాయన్న అని సీఎం ప్రశంసించారు. పాలమూరు బిడ్డ అయిన సాయన్న పోరాట పటిమను జాతి మొత్తం గర్వంగా గుర్తుచేసుకోవాలని, చరిత్ర పుటల్లో ఆయనకు సముచిత స్థానం ఉండాలని ఆకాంక్షించారు. ఇదే స్పూర్తితో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో సర్వాయి పాపన్న గౌడ్, జ్యోతీరావు పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసిన మాదిరిగానే.. మహానీయులు దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న విగ్రహాలను కూడా ప్రతిష్టించనున్నట్లు సీఎం ప్రకటించారు.

సంక్షేమ పథకాలను రెండింతలు చేసి అమలు చేస్తున్నాం..

గత పాలకులు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏ ఒక్కదానిని రద్దు చేయకుండా, వాటిని మరింత మెరుగుపరిచి రెండింతలు చేసి అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతంలో 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే.. నేడు 3.48 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే 55 లక్షల కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్, రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు, రూ. 12 వేల రైతు భరోసా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 25 లక్షలకు పైగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, పేదలకు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ సంక్షేమంలో దూసుకెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.