బంగారం, వెండి ధరల దోబుచులాట..
• అంతర్జాతీయ విపణిలో హెచ్చుతగ్గులు.
• ముగిసిన శుభకార్యాల సీజన్.
• భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.
హైదరాబాద్ , మహా.
దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఊహకందని రీతిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో ఆభరణాల ప్రియులు, కొనుగోలుదారులు తీవ్ర సస్పెన్స్‌లో పడ్డారు. ఇప్పుడున్న ధరలకు కొనుగోలు చేస్తే ఒకవేళ రేపు ధరలు మరింత తగ్గుతాయేమోనని కొందరు ఆందోళన చెందుతుంటే, ఒకవేళ ఇప్పుడే కొనుగోలు చేయకపోతే భవిష్యత్తులో ధరలు విపరీతంగా పెరిగినప్పుడు నష్టపోతామేమోనని మరికొందరు మదనపడుతున్నారు. మార్కెట్లో ఎలాంటి స్థిరత్వం లేకపోవడంతో కొనుగోలుదారులు కొంత ఆలస్యమైనా పర్వాలేదనే ధోరణితో వేచి చూసే సరళిని అవలంబిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం వంటి అంశాలు పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వీటికి తోడు పశ్చిమాసియాలో తిరిగి రాజుకున్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం నేరుగా విలువైన లోహాల ధరలపై పడుతోంది. ఈ అనూహ్య పరిణామాల కారణంగా కొందరు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఇదే అదునుగా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం శుభకార్యాల సీజన్ ముగియడం, తిరిగి వచ్చే ఏడాది జనవరి వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో మార్కెట్లో కొనుగోళ్ల జోరు కొంత మందగించింది. ఆభరణాల కొనుగోలుదారులతో పాటు పసిడిపై పెట్టుబడి పెట్టేవారు కూడా ప్రస్తుతానికి వెనకడుగు వేశారు.
ఈ నేపథ్యంలో దేశంలో బంగారం మరియు వెండి ధరలు గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,890 వద్ద ట్రేడవుతుండగా, స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,070కి దిగివచ్చింది. అలాగే వెండి విషయానికి వస్తే, కిలో వెండిపై వంద రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ. 2,29,000 వద్ద కొనసాగుతోంది. అయితే మార్కెట్ కదలికలను బట్టి మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి ఈ ధరల్లో మరికొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.








