- సమ్మెపై నిషేధం మరో ఆరు నెలలు పొడిగింపు!
- ఎల్‌నినో ప్రభావంతో మునుముందు నీటి ఎద్దడి ముప్పు.
- ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం.
- ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వృష్ణాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిని తలపించేలా మారుతున్న వాతావరణ పరిస్థితులు, తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హైదరాబాద్ వాటర్ వర్క్స్) ఉద్యోగుల సమ్మెపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ మేరకు సమ్మె నిషేధాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ గురువారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, తాగునీటి అత్యవసర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో నంబర్ 955ను విడుదల చేశారు. అక్టోబర్ 21వ తేదీ నుంచే ఈ సమ్మె నిషేధం అమల్లోకి వచ్చిందని ఆ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అత్యవసర సేవలైన తాగునీటి సరఫరా, పంపిణీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల వల్ల వర్షాలు సకాలంలో కురవక నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతున్న తరుణంలో, నగర ప్రజలకు నిరంతరం తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మారింది. ఈ నేపథ్యంలో జలమండలిలో ఏ రూపంలోనూ సమ్మెలకు, ఆందోళనలకు అనుమతి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని హైదరాబాద్ వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజా సేవలకు భంగం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా నిబంధనల ప్రకారం తగిన చర్యలు ఉంటాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.








