- పవన్ కళ్యాణ్ కార్యాలయం సీరియస్!
- రాజీనామా వార్తలపై తీవ్ర ఆగ్రహం.. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు.
- ‘నకిలీ ఛానళ్ల ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు హెచ్చరిక
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును, కార్యాలయ గుర్తింపును అడ్డుపెట్టుకుని సామాజిక మాధ్యమాలలో కొందరు దుండగులు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై డిప్యూటీ సీఎం కార్యాలయం తీవ్రంగా స్పందించింది. “డిప్యూటీ సీఎం ఓ ఆంధ్ర ప్రదేశ్”పేరుతో కొందరు వ్యక్తులు నకిలీ వాట్సాప్ ఛానల్ను సృష్టించి, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారంటూ పూర్తిగా నిరాధారమైన, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుండటాన్ని అధికారికంగా ఖండించింది. ప్రభుత్వ కార్యాలయాల గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఇటువంటి కుట్రపూరిత చర్యలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.
ఈ నకిలీ వాట్సాప్ ఛానల్ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అత్యంత సీరియస్గా దృష్టి సారించింది. ఇప్పటికే ఈ దుశ్చర్యకు పాల్పడిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదుకు తగిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. బాధ్యులైన ఎంతటి వారైనా సరే చట్టం ఎదుట నిలబెట్టి కఠినంగా శిక్షించేలా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వ అధికారిక హోదాను, పేరును అడ్డంపెట్టుకుని ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూసే వారి ఆటలు సాగనివ్వమని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, జనసేన శ్రేణులు, సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఆ నకిలీ ఛానల్ను ఎవరూ విశ్వసించవద్దని, ఫాలో కావద్దని, అందులో వచ్చే తప్పుడు సమాచారాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని స్పష్టం చేసింది. ఎటువంటి ప్రామాణికమైన సమాచారం కావాలన్నా, అధికారిక తాజా వివరాలు తెలుసుకోవాలన్నా కేవలం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారికంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా ఖాతాలను, ధృవీకరించిన వాట్సాప్ ఛానల్ను మాత్రమే అనుసరించాలని కోరింది. ప్రభుత్వ వ్యవస్థల పేరుతో ఫేక్ ప్రచారాలు చేసే వారిపై భవిష్యత్తులోనూ ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించింది.








