Mahaa Daily Exclusive

  క్రిటికల్ మినరల్స్ రంగంలో భారత్-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యం!

Share

  • అక్టోబర్ 25 నుంచి ఆస్ట్రేలియాలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటన.

న్యూఢిల్లీ , మహా.

భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య గనులు, క్రిటికల్ మినరల్స్ (అత్యవసర ఖనిజాలు), ఆధునిక సాంకేతికత మరియు ప్రాసెసింగ్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అక్టోబర్ 25 నుంచి 30 వరకు జరగనున్న ఈ అధికారిక పర్యటనలో ఆయన సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో పర్యటించి.. వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ మైనింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు మరియు పారిశ్రామిక దిగ్గజాలతో విస్తృత చర్చలు జరపనున్నారు.

భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక, క్లీన్ ఎనర్జీ అవసరాలకు తగినట్లుగా క్రిటికల్ మినరల్స్ సరఫరాను సుస్థిరం చేయడం, వివిధ దేశాల నుంచి వనరులను సమకూర్చుకునే అవకాశాలను అన్వేషించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భారతదేశంలోని మైనింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, సంయుక్త పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కిషన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

సిడ్నీ వేదికగా కీలక సదస్సులు, సమావేశాలు

అక్టోబర్ 25న సిడ్నీకి చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్టోబర్ 26న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిడ్నీ కార్యాలయాన్ని ప్రారంభించి దాని కార్యకలాపాలను సమీక్షిస్తారు. అదే రోజు ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్నేషనల్ మైనింగ్ అండ్ రిసోర్సెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్‌పో’ – 2026 సదస్సులో పాల్గొని గ్లోబల్ ఆపర్చునిటీస్‌పై కీలకోపన్యాసం చేస్తారు.

అక్టోబర్ 27న ఆస్ట్రేలియా వనరులు, ఉత్తర ఆస్ట్రేలియా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మడలైన్ కింగ్‌తో ఆయన ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఐ ఎం ఏ ఆర్ సి సదస్సులో ఎన్ ఎం డీ సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ‘ఇండియా పెవిలియన్’ను ప్రారంభించడంతో పాటు, ప్రముఖ ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్టోబర్ 28న ‘మినరల్స్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా’ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆస్ట్రేలియా వనరుల శాఖ సహాయ మంత్రి ఆంథనీ చిషోల్మ్‌తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొంటారు.

మెల్‌బోర్న్‌లో పరిశోధన, పెట్టుబడులపై చర్చలు

పర్యటనలో భాగంగా అక్టోబర్ 28న మెల్‌బోర్న్‌కు వెళ్లనున్న కేంద్ర మంత్రి.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌బీసీసీ ఆస్ట్రేలియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన సమక్షంలో ఎన్‌బీసీసీ – గోల్డ్‌ఫీల్డ్స్ ఆస్ట్రేలియా మధ్య అవగాహన ఒప్పందాల మార్పిడి జరగనుంది. ఆ తర్వాత స్థానిక ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడనున్నారు.

అక్టోబర్ 29న ప్రఖ్యాత మోనాష్ విశ్వవిద్యాలయంలో జరిగే సదస్సులో పాల్గొని క్రిటికల్ మినరల్స్, మైనింగ్‌లో నూతన సాంకేతికతలు, పర్యావరణ పరిరక్షణ, సంయుక్త పరిశోధనలపై చర్చిస్తారు. అలాగే విక్టోరియా ప్రభుత్వ ప్రతినిధులు, ఆస్ట్రేలియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ మెటలర్జీ శాస్త్రవేత్తలతో సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పర్యావరణహిత మైనింగ్ విధానాలపై చర్చిస్తారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్టోబర్ 30న ఆయన భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

భారతదేశానికి చేకూరే దీర్ఘకాలిక ప్రయోజనాలు

2020 జూన్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన క్రిటికల్ మినరల్స్ సహకార ఒప్పందానికి ఈ పర్యటన మరింత ఊతమివ్వనుంది. ‘ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్’ ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్, గ్రాఫైట్ వంటి అత్యవసర ఖనిజ ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు ఈ పర్యటన దోహదపడుతుంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల విస్తరణకు అవసరమైన ముడిపదార్థాల సరఫరాను సుస్థిరం చేయడంలో ఈ భాగస్వామ్యం అత్యంత కీలకం కానుంది. దేశీయంగా ప్రాసెసింగ్ సామర్థ్యం పెరగడంతో పాటు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఈ పర్యటన మైలురాయిగా నిలవనుంది.